తిరుమలలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు
తిరుమలలో వచ్చే ఏడాది జరగనున్న వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు( పరీక్షలు)లో పాల్గొనాలని భావించే వారు చివరితేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని టిటిడి సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారిక వెెబ్ సైట్ లో పొందుపర్చింది.
తిరుమల ధర్మగిరిలోని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 2020లో 28వ శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు( పరీక్షలు) జరగనుంది. ఫిబ్రవరి 25 నుండి మార్చి 1వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. ఇందులో పాల్గొనాలని ఆసక్తి కనబరుస్తున్నవారు ఈనెల(అక్టోబరు) 20వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని టిటిడి స్పష్డం చేసింది.
37 వేద శాఖలకు సంబంధించిన పరీక్షలను ఈ సదస్సులో నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. భవిష్యత్తులో టిటిడి, రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాలలో అర్చకుల నియామకానికి ఏ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారని ఎస్వీ వేద విజ్ఞాన పీఠం అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు 27 సార్లు శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులు జరిగాయి. వచ్చే ఏడాదిలో జరిగేది 28వది. ఈ సదస్సుుకు సంబంధించిన ఇతర వివరాల కోసం టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org ను సంప్రదించగలరు.