టిటిడి ఆస్తులపై ఈవో ఆరా... డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని ఆదేశం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు టిటిడి ఈవో అశోక్ సింఘాల్ చర్యలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు ఆదేశాలు కూడా జాారీ చేసినట్లు తెలుస్తోంది.
అమరావతి: దేశంలోని వివిద ప్రాంతాలలో ఉన్న టిటిడి భూములకు సంభందించిన డాక్యుమెంటేషన్ త్వరిత గతిన పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల కార్యాలయంలో గురువారం ఉదయం ఈవో ఐటి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఆస్తుల పరిరక్షణ కొరకు నూతనంగా రూపొందించిన ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌ను సమర్ధవంతంగా ఉపయోగించుకుని టిటిడి భూములకు సంబంధించిన పాత పత్రాలను డిజిటలైజ్ చేయాలన్నారు. ప్రాంతాలవారిగా స్థిర, చరాస్తులను లెక్కించి వాటికి సంబంధించిన పత్రాలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
టిటిడి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందిస్తున్న సేవలన్నింటినీ గోవింద మొబైల్ యాప్‌లోనూ అందిస్తోందన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా టిటిడి చేస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు నవీకరణ చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. గోవింద మొబైల్ యాప్ ద్వారా రూ.300/- దర్శన టికెట్లు, ఆర్జితసేవలు, పసతి, తదితర సేవలను ఆన్‌లైన్‌లో పొందేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యాలకు సంబంధించి జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు.
శ్రీవారి సేవను నెక్ట్స్‌జెన్ అప్లికేషన్ త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుండి విచ్చేసే శ్రీవారి సేవకుల రిజిస్ట్రేషన్ కొరకు ఏర్పాటు చేస్తున్న అప్లికేషన్ మరింత సరళంగా ఉండాలన్నారు. అదేవిధంగా సేవాసదన్‌లో వారికి కల్పించే లాకర్, బెడ్లు కేటాయించే విధానం కూడా అప్లికేషన్‌లో భాగంగా ఉండాలన్నారు. టిటిడి అనుబంధ ఆలయాలలో ఉత్సవాలు నిర్వహించేందుకు అవసరాల నిమిత్తం విభాగాల వారిగా ఎంతెంత ఖర్చు అవుతుంది, తదితర అంశాలపై బడ్జెట్ వివరాలను కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ తయారు చేయాలన్నారు.
ఇటీవల నూతనంగా ప్రారంభించిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంలో బస కొరకు రూపొందించిన వసతి నిర్వహణ వ్యవస్థ (అకామిడేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం) అప్లికేషన్‌ను తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సమూదాయాలలో కూడా అమలు చేయాలన్నారు. టిటిడి కళాశాలలో 2020-21 విద్యాసంవత్సరం వివిద కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన అప్లికేషన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఐటి, విద్యాశాఖ అధికారులను ఈవో ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్, ఎఫ్ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, సిఇ రామచంద్రరెడ్డి, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.