తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చిత్తూరు జిల్లా వాసులపై వరాల జల్లు ప్రకటించింది. టీటీడీలోని జూనియర్ అసిస్టెంబ్ స్థాయి ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా ప్రజలకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించింది.

ఈ మేరకు టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా వున్న భూమన కరుణాకర్‌రెడ్డి మంగళవారం బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన టీటీడీ ప్రభుత్వ అనుమతి కోసం పంపింది.

దీనికి కనుక ఆమోదం లభిస్తే.. ఇప్పటి నుంచి వెలువడే ఉద్యోగాల భర్తీలో అధిక భాగం చిత్తూరు జిల్లా వాసులకే దక్కే అవకాశం ఉంది. టీటీడీ నిర్ణయం పట్ల చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read:కీలక అదికారిపై బదిలీ వేటు: టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్..?

ఆగమ సలహామండలి సభ్యుడిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్నారు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తన రీ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. వారం లోగా శ్రీవారి ప్రధాన అర్చక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని.. అర్చకులంతా సీఎంకు రుణపడివున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదవీ విరమణ నిబంధనను తొలగిస్తానని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని రమణ దీక్షితులు వెల్లడించారు. 

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఆయనకు టీటీడీ ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్లుగా తెలిపింది. రమణ దీక్షితులను టీటీడీ ఆగమ సలహాదారుడిగా నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:వారంలోగా ప్రధాన అర్చకుడినవుతా: రమణ దీక్షితులు

కొత్తగా ఆలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణ దీక్షితులు సేవలందించనున్నారు. మరోవైపు రమణ దీక్షితులు ఇద్దరు కుమారులకు కూడా అర్చకత్వ బాధ్యతలు అప్పగించాలని టీటీడీ బోర్డు భావిస్తోంది. 

మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. నూతన టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించనుందని ఈరోజు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  

ఇకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా చేరిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడుతుందని అంతా ప్రచారం జరిగింది.

ఇంతవరకు పాలనపై దృష్టి సారించిన సీఎం జగన్ తాజాగా టీటీడీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలోనే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీవేటు వేసినట్లు తెలుస్తోంది.