తిరుమల అగ్నిప్రమాదం వెనుక పెద్ద కుట్ర...: శ్రీనివాసానంద సరస్వతి సంచలనం
తిరుమల బూందీ పోటులో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై విశాఖ అనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం రాష్ట్రానికి అరిష్టమని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. ఈ అగ్నప్రమాదం వెనుక పెద్ద కుట్ర దాగివుందని... అన్యమతస్తుల హస్తం ఉందని అనుమానం ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.
హిందువుల పవిత్ర దేవాలయంలో రోజుకో ఘటన చోటుచేసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోందని శ్రీనివాసానంద పేర్కొన్నారు. తిరుమలలో ఎక్కువ మంది సిబ్బంది అన్యమతస్తులే ఉన్నారని... వారివల్ల దేవాలయ పవిత్రకు భంగం వాటిల్లే అవకాశముందన్నారు.
read more తిరుమలలో అగ్నిప్రమాదం: బూంది పోటులో చెలరేగిన మంటలు
పవిత్రమైన తిరుపతి దేవాలయంలో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్యమతస్తులయిన టిటిడి సిబ్బందిని తొలగిస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ హామీని నిలబెట్టుకోవాలని... అలాగే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ఉన్న అన్యమత సిబ్బందిని తొలగించాలని శ్రీనివాసానంద డిమాండ్ చేశారు.
తిరుమలలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీవారికి ప్రసాదాలు తయారు చేసే బూంది పోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో రెండు ఫైరింజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
read more నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు... పక్కాగా అమలు: సీఎస్ ఆదేశం
బూంది తయారు చేస్తుండగా స్టవ్ నుంచి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన సమయంలో లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు సుమారు 40 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.
మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఇదే బూంది పోటులో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజు ఈ ప్రాంతంలో బూంది తయారు చేయడాన్ని నిలిపివేసి పోటును శుభ్రపరుస్తారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ శాఖ దర్యాప్తు చేస్తోంది.