తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీలేరు డిపోకు చెందిన ఓ ఆర్టీసి బస్సు కారును ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ  దుర్ఘటన రాయచోటిలో విషాదం నింపింది. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాయచోటికి చెందిన ఓ కుటుంబం కారులో బంధువుల వద్దకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు కలకడ మండలకేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ ఎదురుగా  వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. పీలేరు నుండి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసి బస్సు కూడా మితిమీరిన వేగంతో వుండటంతో ప్రమాద తీవ్రత అధికంగా వుంది. 

ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కు అయ్యింది. కారు పూర్తిగా బస్సు కిందికి చొచ్చుకుపోయింది. దీంతో మృతదేహాలు కారులోంచి తీయడానికి రానివిధంగా చిక్కుకున్నాయి. బస్సులోని కొందరు ప్రయాణికులు కూడా స్వల్పంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ముందు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందకు దర్యాప్తు చేపట్టారు.