చిత్తూరు: మరో వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం సిద్దిరాజుకండ్రిగ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ దస్తగిరి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.

సిద్ధిరాజుకండ్రిగకు చెందిన మురళి (35)కి నాగలాపురం మండలంలోని జంబుకేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారులు హరీష్ (7), మోహన్ (5) ఉన్నారు. అదే గ్రామంలోని ఆదిఆంధ్రవాడలో ఉంటున్న పరశురాం, మురళి మిత్రులు. దాంతో మురలి భార్య అరుణకు, పరుశురాంకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 

నాలుగు రోజుల క్రితం మురళికి ఆ విషయం తెలిసిందే. దాంతో అరుణతో మురళి గొడవ పడ్డాడు. దాంతో ఇద్దరు పిల్లలను తీసుకుని నాగలాపురంలోని తన పుట్టింటికి వెళ్లింది. శనివారం అత్తారింటికి మురళి వెళ్లాడు. అయితే, బంధువులు తనను, తన భార్యను హేళన చేయడంతో అవమానంగా ఫీలయ్యాడు. 

పెద్ద కుమారుడితో కలిసి స్వగ్రామం చేరుకున్న మురళి పరశురాంను కలిసి తన భార్యతో సంబంధం మానుకోవాలని కోరాడు. దానికి పరశురాం నుంచి సమాధానం రాలేదు. దాంతో మనస్తాపానికి గురైన మురళి ఇంట్లో ఉరేసుకుని మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.