తిరుపతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ వైద్య సహాకురాలిగా పనిచేస్తున్న మహిళకు సంబంధించి విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని అనంతవీధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శరణ్ అనే వ్యక్తి భార్య త్రివేణి కాళ్లూ చేతులూ విరగ్గొట్టి పరారయ్యాడు. 

వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్న భార్యను ఉద్యోగం మానేయాలని భర్త గత కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. ఆమెపై అనుమానంతోనే ఆ ఒత్తిడి పెడుతూ వచ్చాడు. ఆమె వినకపోవడంతో పిల్లలను తీసుకుని దుర్గసముద్రం వెళ్లిపోయాడు. పిల్లల కోసం త్రివేణి అత్తారింటికి వెళ్లింది. 

ఆమెపై భర్త రాడ్ తో దాడి చేశాడు.  ఆ తర్వాత కాళ్లూ చేతులూ విరిచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె తమ్ముడు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. రుయా ఆస్పత్రిలో చేర్చాడు. ఆ తర్వాత ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శరణ్ పై త్రివేణి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సకాలంలో ఆస్పత్రికి తరలించకుండా ఉంటే ఆమె ప్రాణాలు కోల్పోయేదని అంటున్నారు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులను, వైద్య సహాయకులను అందరూ అభినందిస్తున్న వేళ ఓ భర్త వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్న భార్యపై అత్యంత అమానుషంగా ప్రవర్తించడం అందరి గుండెలనూ పిండేస్తోంది.