చిత్తూరు జిల్లాలో ఇటీవల వార్డు కార్యదర్శి పోస్టులకు డిగ్రీ అర్హతతో నియమితులైన వారిని అధికారులు రాజీనామా చేయాలని కోరడంతో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో వార్డు కార్యదర్శి పోస్టులకు పోస్టులకు బీకాం డిగ్రీతో 41 మంది ఎంపికయ్యారు.  

వీరికి రెండ్రోజుల కిందట నియామక పత్రంతో పాటు పోస్టింగ్ ఉత్తర్వులను అధికారులు జారీ చేశారు. ఈ క్రమంలో ధ్రువపత్రాల రీ వెరిఫికేషన్ పేరిట 16 మందిని చిత్తూరు నగరపాలక కార్యాలయానికి పిలిపించారు.

ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వారిని అనర్హులుగా ప్రకటిస్తూ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని అధికారులు సూచించారు. దీంతో బాధితులు కార్పోరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చిన రెండ్రోజుల్లోనే రాజీనామా చేయాలని చెప్పడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమీషనర్..  జిల్లా కలెక్టర్‌తో  చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.