తిరుమల శ్రీవారి ఆదాయంపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి ఆదాయంపై బిజెపి ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆదాయాన్ని రాయలసీమలోనే ఖర్చుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ సభ్యులుగా ఉంటున్నవాళ్లు రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని అన్నారు.
కర్నూలు: తిరుమల శ్రీవారి ఆదాయంపై బిజెపి పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని, టీటీడీకి వచ్చే ఆదాయాన్ని రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని ఆనయ అన్నారు.
విజయవాడ దుర్గ గుడి, సింహాచలం ఆలయాల డబ్బులు ఆ ప్రాంతానికి ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలవారిని టీటీడీ సభ్యులుగా నియమిస్తున్నారని, కానీ వారు మాత్రం రాయలసీమ అభివృద్ధిపై మాత్రం మనసు పెట్టడం లేదని ఆయన అన్నారు.
రాయలసీమ నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని టీజీ వెంకటేష్ అన్నారు. గోదావరి నీళ్లు కృష్ణా ప్రాంతానికే ఇచ్చి రాయలసీమ నీళ్లు సీమ వాడుకునేలే చేస్తామని గతంలో వైఎస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో అలజడులు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
గుండ్రేవుల, సిద్ధేశ్వరం, అలుగు ప్రాజెక్టులు నిర్మిస్తే తమ నీళ్లు తామే వాడుకోవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఆయన అన్నారు. సిఎం జనగ్ కూడా ఎన్నికల ప్రణాళిక హామీలకే రాష్ట్ర బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతుందని అన్నారు.
అమరావతిని ఫ్రీ జోన్, నీళ్లు, నిధుల విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో జగన్ ప్రాజెక్టులను అతి వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.