మాతృత్వ సెలవులో(మెటర్నిటీ లీవ్) రెండేండ్లు గడిపిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తిరిగి రాకెట్‌ పట్టుకునేందుకు సిద్ధమైంది. ఆరు నెలల ముందే అంతర్జాతీయ పునరాగమం చేద్దామనుకున్న సానియాకు చికెన్‌ గున్యా రూపంలో అవాంతరం ఎదురైంది. 

ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన సానియా 2020 జనవరిలో హౌబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో రాకెట్‌ పట్టనుంది.  తాను హౌబర్ట్‌ ఇంటర్నేషన్‌లో ఆడుతున్నానని, ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఆడతానని కూడా తెలిపారు.  

Also read: నాకు పెళ్లి కాదని భయపెట్టేవారు... సానియా మీర్జా షాకింగ్ కామెంట్స్

ముంబయిలో ఓ టోర్నీ ఆడేందుకు సన్నద్ధం అవుతున్నానని, కానీ అవకాశాలు 50-50 మాత్రమేనని అభిప్రాయపడింది.  కానీ హౌబర్ట్‌లో ఆడటం మాత్రం పక్కా అని తేల్చి చెప్పింది.  

ఇక తన మాతృత్వం గురించి పంచుకుంటూ, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది.  చికెన్‌ గున్యా కారణంగా ప్రణాళికలు తారుమారు అయ్యాయని బాధపడింది.  

భారత్‌కు మూడు సార్లు ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించానని, రియోలో తృటిలో పతకం కోల్పోయామని వాపోయింది. మరోసారి ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం దక్కితే గొప్ప గౌరవంగా భావిస్తానని సానియా మీర్జా తెలిపింది. 

ఈ భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ వరల్డ్‌ నం.38, ఉక్రెయిన్‌ క్రీడాకారిణి నదియా కిచనోక్‌తో మహిళల డబుల్స్‌లో జట్టు కట్టనుంది.

ఇక గత నెలలో కుమారుడు ఇజాన్ పుట్టినరోజు సందర్భంగా సానియా తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఇజాన్ మొదటి పుట్టిన రోజుని అక్టోబర్ 30వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సానియా తన కొడుకు గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టు మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంది.

Also read: నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గి...రీఎంట్రీ కోసం ఎలా కష్టపడ్డానంటే: సానియా మీర్జా

తన చివరి శ్వాస వరకు తన కొడుకుతోనే ఉంటానంటూ ఆమె పెట్టిన పోస్టు అభిమానులను ఆకట్టుకుంటోంది. తన ముద్దుల కుమారుడిని ఎత్తుకొని సానియా ఫోటో కూడా షేర్ చేసింది. ఇంతకీ ఆ పోస్టులో సానియా మీర్జా ఏం రాసిందంటే...

‘‘ సరిగ్గా సంవత్సరం క్రితం నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావు.అప్పటి నుంచి నువ్వే మా ప్రపంచం అయ్యావు. నువ్వు పుట్టిన రోజే నవ్వావు. ఆ రోజు నుంచి ఆ నవ్వులను మాతో పంచుతూనే ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళితే...అక్కడ ఆ నవ్వులు విరబూస్తున్నాయి. నువ్వు స్వచ్ఛమైన వాడివి. ఐలవ్ యూ. ఈ రోజు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నేనే నీకు తోడుగా ఉంటాను. నువ్వు కోరుకున్న ప్రతిదీ భగవంతుడు నీకు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. సంతోషంగా, ఆనందంతో నీ జీవితం సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఇజాన్ ని మాకు ఇచ్చినందుకు అల్లాకి థ్యాంక్స్’’ అని ఆమె తన కుమారుడిని ఉద్దేశించి పోస్టు చేశారు.

మరో పోస్టులో ఓ వీడియోని విడుదల చేశారు. అందులో సానియా సోదరి ఆనమ్ మీర్జాతో బర్త్ డే బాయ్ ఇజాన్ ఆడుకుంటున్నాడు. ఈ రెండు పోస్టులు సానియా అభిమానులను ఆకట్టుకున్నాయి. నెటిజన్లు కూడా సానియా కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.