నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గి...రీఎంట్రీ కోసం ఎలా కష్టపడ్డానంటే: సానియా మీర్జా (వీడియో)
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ టెన్నిస్ లో పునరాగమనం చేసేందుకు తెగ కష్టపడుతున్నారు. కేవలం 4 నెలల్లోనే ఆమె 26 కేజీల బరువు తగ్గి టెన్నిస్ కు అనుకూలంగా శరీరాన్ని తయారుచేసుకున్నారు.
గత రెండేళ్లుగా టెన్నిస్ కోర్టుకు దూరమైన సానియా మీర్జా పునరాగమనం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతేడాది అక్టోబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా భారీగా వెయిట్ పెరిగిపోయారు. దీంతో గత నాలుగు నెలలుగా కఠోరంగా శ్రమించిన ఆమె ఏకంగా 26కిలోల బరువు తగ్గారట. ఈ విషయాన్ని స్వయంగా సానియానే వెల్లడించారు. అంతేకాదు మళ్లీ ఫిట్ గా తయారుయ్యేందుకు జిమ్ లో ఎంత కఠోరంగా శ్రమించానో చూడండంటూ సోషల్ మీడియా మాద్యమాల్లో తాను వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. టెన్సిస్ కోర్టులో చురుగ్గా కదిలేందుకే ఇంతలా కష్టపడుతున్నానంటూ సానియా తెలిపింది.
ఇన్ట్సాగ్రామ్ లో తన జిమ్ వర్కౌంట్స్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఆమె ఓ సుదీర్ఘ సందేశాన్ని కూడా జతచేసింది. '' బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడేందుకు సిద్దమయ్యాను. అందుకోసం ఎలా సిద్దమవుతున్నానో అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. అనుకున్నట్లే ఇప్పుడు మంచి ఆరోగ్యకరమైన పద్దతుల్లోనే ఫిట్ గా తయారయ్యాను.
ప్రెగ్నేన్సీ కారణంగా గత రెండేళ్లుగా టెన్నిస్ కు దూరమయ్యాను. డైట్ ను కూడా సరిగ్గా పాటించలేకపోయాను. దీంతో బాగా బరువు పెరిగిపోయాను. అయితే ఇటీవల మళ్లీ పునరాగమనం చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం దాదాపు 23కిలోల బరువు తగ్గాలనుకున్నా. కానీ ఎలా...ఎప్పుడు...ఎక్కడ తగ్గాలన్నది తెలీదు.
కానీ గత నాలుగునెలల్లో వీటన్నింటిపై క్లారిటీ వచ్చింది. అంతేకాదు 23కిలోలు తగ్గాలనుకుని వర్కౌట్స్ ప్రారంభించిన నేను ఏకంగా 26కిలోలు తగ్గాను. ఇలా నాలుగునెలల్లో పూర్తి ఫిట్ గా తయారయ్యేందు చాలా కష్టపడ్డాను. క్రమశిక్షణ, నిబద్దతతో కష్టపడటంవల్లే ఇది సాధ్యమయ్యింది.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి బాగా బరువు పెరుగుతుంది. మళ్లీ సాధారణ శరీరాకృతిని సాధించాలంటే చాలా కష్టం. ముఖ్యంగా వెయిట్ విషయంలో. కానీ సంకల్పబలం, ఏదైనా సాధించాలన్న పట్టుదల వుంటేనే సాధ్యమవుతుంది.
మహిళలూ....మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నేను పొందిన ఫలితాన్నే మీరు కూడా పొందొచ్చు. నన్ను నమ్మండి. కేవలం రోజుకు రెండు లేదా మూడు గంటలు శ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఫిజికల్ గానే కాదు మెంటల్ గా కూడా ఆరోగ్యవంతంగా తయారుకావొచ్చు.'' అని సానియా వెల్లడించారు.
సానియా- మాలిక్ దంపతులు గతేడాది అక్టోబర్ లో సంతానాన్ని పొందారు. పండంటి బాబుకు జన్మనిచ్చిన సానియా బాలుడుకి ఇజాన్ అని నామకరణం చేసింది. అయితే ప్రస్తుతం బాలుడికి ఏడాది వయసొచ్చింది కాబట్టి సానియా తిరిగి టెన్నిస్ కెరీర్ ను కొనసాగించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు సానియా కసరత్తులు ప్రారంభించారు.