Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగ భర్తీ పేరిట నయవంచన: పెద్ద దొర, చిన్న దొర అంటూ కేసీఆర్- కేటీఆర్‌లపై షర్మిల వ్యాఖ్యలు

కేటీఆర్‌ను అమెరికా నుండి కొడుకుని తీసుకువచ్చి కేసీఆర్ రెండు మంత్రి పదవులు అప్పజెప్పారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. చిన్న దొర జిల్లాకి వస్తున్నాడంటే ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని షర్మిల ఆరోపించారు.

ysrtp president ys sharmila slams telangana cm kcr and minister ktr ksp
Author
siricilla, First Published Aug 3, 2021, 8:35 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహేందర్ యాదవ్‌ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష ముగిసిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ ఐదు సంత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారని ప్రశంసించారు. ఉచిత విద్యకు శ్రీకారం చుట్టడంతో పాటు ఫీజు రియొబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, 108, వంటి వాటిని ప్రవేశపెట్టారని ఆమె గుర్తుచేశారు.

కేసీఆర్ రుణమాఫీ చేస్తామని చెప్పారని.. దీని కోసం 39 లక్షల మంది ఎదురు చూస్తున్నారని షర్మిల గుర్తుచేశారు. 15 లక్షల మంది పెన్షన్స్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారని.. 15 లక్షల మంది ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు. కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆనాడు ఉద్యమం కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారని.. కానీ నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గడీలో బంది అయిందని.. సీఎం బాత్ రూమ్‌కి బుల్లెట్ ఫ్రూఫ్ ఉంది అంటూ సెటైర్లు వేశారు. 

Also Read:కేటీఆర్ ఇలాకాలో నిరుద్యోగి ఆత్మహత్య... అదే గ్రామంలో నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల (వీడియో)

కేసిఆర్ పెద్ద దొర అని.. ఆడవాళ్లు ఉద్యమాలు చేస్తే చిన్న దొర జీర్ణించుకోలేక పోతున్నాడంటూ కేటీఆర్‌పైనా షర్మిల వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొడుకిని కేసీఆర్ కొడుకు అంటే నచ్చదట.. కేటీఆర్‌కి ఎందుకు నమోషీ అంటూ ఆమె మండిపడ్డారు. అమెరికా నుండి కొడుకుని తీసుకువచ్చి కేసీఆర్ రెండు మంత్రి పదవులు అప్పజెప్పారని షర్మిల తెలిపారు. చిన్న దొర జిల్లాకి వస్తున్నాడంటే ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని షర్మిల ఆరోపించారు.

నెరేళ్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం గుట్కా నిషేధం వుంది కానీ ఇక్కడ మాత్రం నడుస్తోందని షర్మిల ఆరోపించారు. ఇందుకు పోలీస్ ల మద్దతు ఉందని దుయ్యబట్టారు. లంచాలు ఇవ్వలేక ఓ మహిళ పుస్తెలతాడు తహశీల్దార్ కార్యాలయంకి కట్టి పెద్ద దొర, చిన్న దొరకి బుద్ధి చెప్పిందంటూ ఆమె తెలిపారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ  భృతి ఇవ్వాలని, లక్షా 91 ఉద్యోగాలు భర్తీ చేయలేని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios