వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామాపై మీడియా అడిగిన ప్రశ్నలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమాధానం దాటవేశారు. ఇవాళ వైఎస్ఆర్ జయంతి అని దాని గురించే మాట్లాడుకుందామని షర్మిల వ్యాఖ్యానించారు.
గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ (ysrcp plenary) వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) మాతృమూర్తి వైఎస్ విజయమ్మ (ys vijayamma) సంచలన ప్రకటన చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాజకీయాల్లో కలకలం రేపింది. ఆమె నోటి వెంట ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే షర్మిల మీడియా ముందుకు వస్తున్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో ఆమె ఏదైనా కీలక ప్రకటన చేస్తారేమోనన్న అనుమానం కలిగింది. అయితే అందుకు విరుద్ధంగా విజయమ్మ రాజీనామాపై మీడియా ప్రతినిధులకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు షర్మిల.
ఈరోజు రాజశేఖర్ రెడ్డి జయంతి (ys rajasekhara reddy birth anniversary) అని.. ఎక్కడో ఏదో జరిగిందని, తనను ప్రశ్నలు అడిగి .. నేను దానికి సమాధానాలు చెప్పి, మీరు వాటినే హాట్ టాపిక్‌గా చేస్తే అది వైఎస్‌ను అవమానించడమేనని షర్మిల అన్నారు. వైఎస్ పేరు ఒక బ్రాండ్ అని.. దీనిని కేసీఆర్ ముప్పుగా భావిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను సన్మానిస్తున్నారు గానీ.. వైఎస్‌ను చేయడం లేదంటే దానికి అర్ధం అదేనని షర్మిల అన్నారు. వైఎస్ కుటుంబంలోని వ్యక్తిగా కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు కూడా ఆయన మెమోరియల్ కోసం స్థలం కావాలని అడిగామని... ఇప్పటికీ ప్రయత్నిస్తున్నామని షర్మిల చెప్పారు.
ALso REad:అమ్మ రాజీనామా... వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా
ఇప్పుడు తాను తెలంగాణలో పార్టీ పెట్టానని.. ఈ విషయంలో బలంగా పోరాడుతున్నానని ఆమె తెలిపారు. రేవంత్ చెప్పే మాటలు ఎవరు నమ్ముతారని , రోశయ్య కంటే గొప్ప నేత కాదని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆనాడు ఒక టెరరిస్ట్ లాగా మాట్లాడారని.. అందుకే తెలంగాణ ఏర్పాటు జరిగితే హైదరాబాద్ కు ఫ్లైట్ లో రావాలని వైఎస్ అన్నారని షర్మిల గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిందని షర్మిల అన్నారు.
ప్రస్తుత టీఆర్ఎస్ భవన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డే అని .. కానీ కేసీఆర్ సీఎం అయిన వెంటనే వైఎస్ కోసం కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నారని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్ లో రాజశేఖర్ రెడ్డి గౌరవార్ధం తక్షణమే స్థలాన్నికేటాయించాలని షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో వున్న సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ లను లీడర్లుగా చేసింది వైఎస్ కాదా అని ఆమె ప్రశ్నించారు. ఇవాళ వైఎస్ఆర్ జయంతి కాబట్టి... వైఎస్సాఆర్ మెమోరియల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లు షర్మిల తెలిపారు. తాను ఏదో ఒకటి మాట్లాడితే.. అదే హైలెట్ చేస్తారంటూ తన సోదరుడు జగన్ గురించి ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు షర్మిల.
