ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తోన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఆమె ఈ ఘనత అందుకున్నారు. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకున్న వైఎస్ షర్మిల.. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు గాను ప్రజా ప్రస్థానం పేరిట ఆమె రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పాదయాత్ర కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం నాటికి 1,700 కిలోమీటర్ల పాదయాత్రను షర్మిల పూర్తి చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఆమె ఈ ఘనత అందుకున్నారు. 

ఈ సందర్భంగా వైఎస్సార్‌టీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను షర్మిల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రజల సహకారంతోనే 1700 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. పాదయాత్రలో తన వెన్నంటి వున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మాట మీద నిలబడే వైయస్ఆర్ నాయకత్వాన్ని తెలంగాణలో తిరిగి తీసుకొస్తామని.. వైయస్ఆర్ సంక్షేమ పాలన ప్రజలకు చూపిస్తామని షర్మిల వెల్లడించారు. 

ఇకపోతే.. గతవారం వికారాబాద్ జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నిరసన సెగ తగిలింది. ప్రజా ప్రస్థానం యాత్ర చేస్తోన్న షర్మిలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని షర్మిల యాత్రను అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. 

Scroll to load tweet…