తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. వారు గుండాలని, తన దృష్టిలో వారు ఆడోళ్లతో సమానమని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ గూండాలు ఆడోళ్లతో సమానమంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. షర్మిల నిర్వహిస్తోన్న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ వైఎస్సార్‌టీ కార్యకర్తలు పలు చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. అయితే వీటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయం షర్మిల దృష్టికి వెళ్లడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన వారు టీఆర్ఎస్ కార్యకర్తలే అయి వుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు.. వారు గుండాలని, తన దృష్టిలో వారు ఆడోళ్లతో సమానమని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ దత్తత తీసుకున్న గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. దళిత నేత అయివుండి ఎంతమంది దళితులకు దళిత బంధు మంజూరు చేయించారని షర్మిల నిలదీశారు. ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే దాడులకు తెగబడటం, కోడిగుడ్లు విసరడం దుర్మార్గమన్నారు. ఏం చేయలేక పాదయాత్రను అడ్డుకుంటారా.. మీరు మగాళ్లేనా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also REad:పిల్లిలా దాక్కుంటావెందుకు... మోదీని అడిగే దమ్ముందా కేసీఆర్ : వైఎస్ షర్మిల

అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేసారు. ఎన్నికల సమయంలో పెద్దపల్లికి వచ్చిన కేసీఆర్ మనోహర్ రెడ్డి దగ్గర మంచిగ పైసలున్నాయి కాబట్టి అవినీతి చేయడని అన్నాడటగా... ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాదు జేబులోంచి డబ్బులు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుంటాడు కాబట్టి ఆయనను గెలిపించాలని కోరాడటగా అని పెద్దపల్లి ప్రజలను షర్మిల అడిగారు. కేసీఆర్ మాటలు నమ్మి మనోహర్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు పైసలు పెట్టడంమాట అటుంచి వారినుండే పైసలు గుంజుకుంటున్నాడని ఆరోపించారు. 

పెద్దపల్లి ఎమ్మెల్యే ఎంతకు దిగజారాడంటే చివరకు అగ్రికల్చర్ గోదాం​ రేకులు లాక్కొని తన క్యాంప్ ఆఫీస్ కట్టుకోవాలని చూశాడని షర్మిల తెలిపారు. దీంతో ఈయనెంత కక్కుర్తి ఎమ్మెల్యేనో దేశమంతా తెలిసింది... ఇలా చేయడానికి కాస్తయినా సిగ్గుండాలి కదా అంటూ మండిపడ్డారు. దేవాలయాలు, అసైన్డ్, దళితుల భూముల కబ్జా, మానేరులో ఇసుక అక్రమ రవాణా, చివరకు మట్టి... ఇలా దేన్నీ వదలడం లేడటగా మీ ఎమ్మెల్యే అని అడిగారు. ఎమ్మెల్యేకు చెందిన విద్యాసంస్థల ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తారటగా... అంటూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై షర్మిల తీవ్ర ఆరోపణలు చేసారు.