వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. నిన్నటి ఎపిసోడ్‌తో షర్మిలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం గవర్నర్ తమిళిసైని కలవనున్నారు షర్మిల.

రేపు తెలంగాణ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. గురువారం ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ గవర్నర్ తమిళిసైని వైఎస్ షర్మిల కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు వైఎస్సార్‌టీపీ నేతలు.

ఇకపోతే.. వైఎస్ షర్మిల మంగళవారం ప్రగతి భవన్ వైపు వెళ్తున్న సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత మేజిస్ట్రేట్ ఆమెకు వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే వైఎస్ షర్మిల అరెస్ట్, తదితర ఘటనల‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. వైఎస్ షర్మిల కారు లోపల ఉన్నప్పుడే.. కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని అన్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పోస్టు చేశారు. వైఎస్ షర్మిల, ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ డీజీపీలను ట్యాగ్ చేశారు.

ఇదిలావుండగా... సోమవారం నర్సంపేటలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అదే రోజు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. అయితే తన పాదయాత్రలో జరిగిన హింసాత్మక పరిణామాలకు నిరసనగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్‌ను ముట్టడించాలని షర్మిల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి పోలీసుల కళ్లగప్పి బయటకు వచ్చిన షర్మిల.. సోమాజిగూడకు చేరుకున్నారు. 

ALso REad:వైఎస్ షర్మిల అరెస్ట్‌పై గవర్నర్ తమిళిసై ఆందోళన.. ఆ దృశ్యాలు కలవరపెట్టాయని ట్వీట్..

పాదయాత్రలో చోటుచేసుకున్న దాడిలో ధ్వంసం అయిన కారును షర్మిల స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతిభవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమెను పోలీసులు సోమాజిగూడలో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ప్రగతిభవన్ ముట్టడి కోసం వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మరోవైపు షర్మిల కూడా కారులో నుంచి బయటకు రావాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే షర్మిల అందుకు నిరాకరించారు. కారు డోర్స్ లాక్ చేసుకుని లోపలే ఉండిపోయారు. 

ఈ పరిణామాలతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనేక ప్రయత్నాల తర్వాత పోలీసులు ట్రాఫిక్ క్రేన్‌తో.. షర్మిల ఉన్న కారును లిఫ్ట్ చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కారు డోర్స్ తెరిపించి.. బలవంతంగా షర్మిలను ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల చర్యకు నిరసనగా పలువురు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనాలను చెదరగొట్టేందుకు సిబ్బంది స్వల్ప లాఠీచార్జి చేశారు.