Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిల అరెస్ట్‌పై గవర్నర్ తమిళిసై ఆందోళన.. ఆ దృశ్యాలు కలవరపెట్టాయని ట్వీట్..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

governor tamilisai soundararajan Response on YSRTP Chief YS Sharmila Arrest
Author
First Published Nov 30, 2022, 11:49 AM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ప్రగతి భవన్ వైపు వెళ్తున్న సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మేజిస్ట్రేల్ ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత మేజిస్ట్రేట్ ఆమెకు వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే వైఎస్ షర్మిల అరెస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. 

వైఎస్ షర్మిల కారులోపల ఉన్నప్పుడే.. కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని అన్నారు.  ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పోస్టు చేశారు. వైఎస్ షర్మిల, ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ డీజీపీలను ట్యాగ్ చేశారు. 

ఇదిలా ఉంటే.. సోమవారం నర్సంపేటలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అదే రోజు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. అయితే తన పాదయాత్రలో జరిగిన హింసాత్మక పరిణామాలకు నిరసనగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్‌ను ముట్టడించాలని షర్మిల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి పోలీసుల కళ్లగప్పి బయటకు వచ్చిన షర్మిల.. సోమాజిగూడకు చేరుకున్నారు. 

పాదయాత్రలో చోటుచేసుకున్న దాడిలో ధ్వంసం అయిన కారును షర్మిల స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతిభవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆమెను పోలీసులు సోమాజిగూడలో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ప్రగతిభవన్ ముట్టడి కోసం వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మరోవైపు షర్మిల కూడా కారులో నుంచి బయటకు రావాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే షర్మిల అందుకు నిరాకరించారు. కారు డోర్స్ లాక్ చేసుకుని లోపలే ఉండిపోయారు. 

ఈ పరిణామాలతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనేక ప్రయత్నాల తర్వాత పోలీసులు ట్రాఫిక్ క్రేన్‌తో.. షర్మిల ఉన్న కారును లిఫ్ట్ చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కారు డోర్స్ తెరిపించి.. బలవంతంగా షర్మిలను ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల చర్యకు నిరసనగా పలువురు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనాలను చెదరగొట్టేందుకు సిబ్బంది స్వల్ప లాఠీచార్జి చేశారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ షర్మిల భర్త అనిల్‌కుమార్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ‘‘ఆమె ఒక అధికారిని అడ్డుకుని, దాడి చేసిందని, ఆమెను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఆమె మంచి కోసం పోరాడే మహిళ. సోదరుడిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి) ఆమెను పరామర్శించవచ్చు’’ అని అనిల్ అన్నారు. 

మరోవైపు షర్మిలను పరామర్శించేందుకు పోలీసు స్టేషన్‌కు బయలుదేరిన ఆమె తల్లి విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విజయమ్మకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అయితే షర్మిలకు బెయిల్ మంజూరు అయిన  తర్వాత దీక్షను విరమించారు. 

ఇక, పంజాగుట్ట పోలీసులు వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. షర్మిల తన వాహనాన్ని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపారు. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న మహిళా పోలీసు అధికారి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఆమెను అన్‌పార్లమెంటరీ భాషలో దుర్భాషలాడారు. ఆమె విధులను నిర్వహించకుండా అడ్డుకున్నారు. 

వైఎస్ షర్మిలతో పాటు మరో ఆరుగురిపై దొంగతనం, నేరపూరిత బెదిరింపులు మరియు బహిరంగంగా ఇబ్బంది పెట్టడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. సాయంత్రం వారరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లిలోని 14వ చీఫ్ అదనపు  మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వారికి వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios