తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కంటే పెద్ద వైరస్ అంటూ వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేసారు.
హైదరాబాద్ : యావత్ ప్రపంచాన్ని గత కొన్నేళ్లు పట్టిపీడించిన కరోనా మహమ్మారి కంటే భయంకరమైన వ్యాధులు భవిష్యత్ లో వచ్చే ప్రమాదముందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. కరోనా కంటే మించిన వైరస్ లు వస్తాయని దొర జోస్యం చెబుతున్నారు... కానీ తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించే కేసీఆర్ కంటే పెద్ద వైరస్ ఏది రాదులే! అంటూ సెటైర్లు విసిరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టిపీడించే అతి పెద్ద వైరస్ అంటూ షర్మిల ఎద్దేవా చేసారు.
సుభిక్షంగా వున్న తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చెయ్యడానికే పుట్టిన మహమ్మారే బిఆర్ఎస్ అంటూ షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను అప్పులపాలు చెయ్యడానికి పట్టుకున్న వైరస్ మీరే అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మేమంతా కరోనాతో పోరాడి నిలిచామేమో కానీ బిఆర్ఎస్ వైరస్ కంటపడితే ఖేల్ ఖతం దుకాణం బంద్ ఖాయమంటూ షర్మిల ఎద్దేవా చేసారు.
''రాష్ట్రంలో వైద్యాన్ని ఉద్ధరించినట్లు ఉద్దెర మాటలు చెప్పే దొర గారు... నిమ్స్ విస్తరణకు కొబ్బరి కాయ కొట్టారు సరే..గత శంకుస్థాపనల సంగతి ఏంటో జర చెప్పు సారు. 15 వందల కోట్లతో ఉస్మానియా దవాఖానాలో కడతామని చెప్పిన ట్విన్ టవర్స్ ఎక్కడ..? నగరం నలుమూలల నాలుగు పెద్దాసుపత్రులు ఎక్కడ..? అక్కడ కార్పొరేట్ వైద్యం ఏమాయే.. ఎయిమ్స్ ను మించిన ట్రీట్మెంట్ కనపడదాయే... కొబ్బరికాయ కొట్టి 14 నెలలైనా పునాదిరాయి పడక పాయె'' అంటూ షర్మిల నిలదీసారు.
Read More తాలిబన్ కేసీఆర్ కు సంకెళ్లేసి జైలుకు పంపండి... రైతుల్ని కాదు..: షర్మిల సీరియస్
''దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు. కొబ్బరికాయలు, శంకుస్థాపనలు ఇదే మీరు 10 ఏళ్లలో సాధించిన ఆరోగ్య తెలంగాణ. మీ మహమ్మారి పాలన అంతానికి ఇంజక్షన్ రెడీ అయ్యింది దొర గారు'' అంటూ ట్విట్టర్ వేదికన సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు వైఎస్ షర్మిల.
కేసీఆర్ ఏమన్నారంటే:
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున గల నిమ్స్ హాస్పిటల్ కు వచ్చి పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి అదునాతన సదుపాయాలతో భారీ భవనం నిర్మించాలని నిర్ణయించింది. పంజాగుట్టలో ప్రస్తుతమున్న నిమ్స్ పరిసరాల్లోనే రూ.1571 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భవిష్యత్ లో కరోనాను మించిన వైరస్ లు మానవాళిని చుట్టుముట్టనున్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. అలాంటి వాటిని తట్టుకునేలా వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే నిమ్స్ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
