న్యాయం కోసం ఆందోళన చేసిన రైతులను అరెస్ట్ చేసి బేడీలేసి మరీ కోర్టుకు తీసుకువెళ్లిన ఘటనపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)లో భూములు కోల్పోతున్న రైతులు న్యాయం కోసం ఆందోళనకు దిగిన రైతులకు పోలీసులు సంకెళ్లు వేయడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న రాయగిరి రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు నల్గొండ జైలు తకలించిన విషయం తెలిసిందే. అయితే వారిని భువనగిరి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో బేడీలు వేసిన పోలీసుల తీరుపై ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై స్పందించిన వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల బిఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
''దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు తప్పని సంకెళ్లు... "ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ " అంటే ఇదేనా దొర గారు?... నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదంటే బేడీలు వేయడమా మీరిచ్చే భరోసా..? మీ బందిపోట్లను ప్రశ్నిస్తే రైతు అని చూడకుండా జైలుకు పంపడమేనా మీ నినాదం? మద్దతు ధర అడిగితే సంకెళ్లు.పంట కొనండని అడిగితే సంకెళ్లు. భూములు పోయాయని అడిగితే సంకెళ్లు.భూములు ఇవ్వం అని చెప్పినా సంకెళ్లు. ఆక్రందన, ఆవేదన, ఆందోళన ఏది చూపినా రైతుకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లు'' అంటూ షర్మిల మండిపడ్డారు.
''కిసాన్ భరోసా అని, వచ్చేది రైతు ప్రభుత్వమేనని చెప్పుకొనేందుకు సిగ్గుపడు దొర సిగ్గుపడు. మీది భరోసానిచ్చే సర్కార్ కాదు."రైతుకు బేడీలు వేసే సర్కార్". రైతును బర్బాత్ చేసే సర్కార్. రారాజును తీవ్రవాది గా చూసే సర్కార్. రైతులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి సంకెళ్లు వేసిన కేసీఆర్ ఒక తాలిబాన్. అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేసిన కనికరం లేని కసాయి ఈ కేసీఆర్'' అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read More కాంగ్రెస్ లోకి మాజీ బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు:తెలంగాణలో నిశ్శబ్దం రానుందన్న రేవంత్
''దేశ చరిత్రలో రైతులను మూడుసార్లు జైలుకి పంపిన చరిత్ర నీదే దొర. భూములు పోతున్నాయి మహాప్రభో అని నిరసన తెలిపితే అరెస్టులు చేయిస్తవ? ట్రిపుల్ఆర్ అలైన్ మెంట్ అన్యాయని అడిగితే జైల్లో పెట్టిస్తవ? అరెస్ట్ చేయాల్సింది రైతులను కాదు. భూములు మింగే దొర కేసీఆర్ ను. బీఆర్ఎస్ దొంగలకు అనువుగా ట్రిపుల్ అర్ అలైన్ మెంట్ మార్చిన కేసీఆర్ ను జైలుకు పంపాలి. న్యాయమని అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నీ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సంకెళ్లు నీకే వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు'' అంటూ ట్విట్టర్ వేదికన మండిపడ్డారు వైఎస్ షర్మిల.
ఇక ఇప్పటికే రైతులకు బేడీలు వేయడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల కాకుండా ఎకరా రెండెకరాల భూములు గల చిన్న సన్నకారు రైతుల భూములు లాక్కుంటున్నారని ఎంపీ ఆరోపించారు. తమకు అన్యాయం జరుగుతోందని శాంతియుత ఆందోళనకు దిగిన రైతులకు బేడీలు వేయడం చూసి కన్నీళ్లు వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేసారు.
