Asianet News TeluguAsianet News Telugu

స్పీకర్ చర్యలు తీసుకొంటే న్యాయపరంగా వెళ్తాం: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల

తనపై ఇష్టారీతిలో మాట్లాడినా కూడా నోరు మూసుకొని ఉండాలా అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తనను మరదలు అని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సమర్ధనీయమా అని ఆమె అడిగారు. 

YSRTP Chief YS Sharmila Reacts on Trs MLAs complaint Against Her To Speaker
Author
First Published Sep 14, 2022, 12:12 PM IST

మహబూబ్ నగర్:  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి  తనపై చర్యలు తీసుకొంటే న్యాయపరంగా ముందుకు వెళ్తానని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పారు.మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం నాడు పిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై వైఎస్ షర్మిల స్పందించారు. బుధవారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.పాదయాత్ర శిబిరం వద్ద ఆమె తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రజలు చర్చించుకుంటున్న అంశాలతో పాటు జర్నలిస్టుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా తాను పాదయాత్ర సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శలు చేసినట్టుగా షర్మిల వివరించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తన పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులపై తాను చేసిన విమర్శల్లో అవాస్తవాలు లేవన్నారు. ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే తాను ప్రస్తావించానన్నారు. ప్రజలు చర్చించుకుంటున్నఅంశాలకు ఆధారాలు ఉండవన్నారు. 

రాష్ట్రంలో చోటు చేసుకున్న విషయాలపై మాట్లాడేందుకు ప్రజలు భయపడుతున్నారన్నారు. ప్రజలే కాదు జర్నలిస్టులు కూడా ఈ విషయమై మాట్లాడేందుకు జంకుతున్నారని ఆమె చెప్పారు. ఉద్యోగాలు తీయించి వేస్తారని, కేసులు పెడతారనే భయం ఉందన్నారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతి గురించి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించేసరికి కోపం వస్తుందా అని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. నిజాలు మాట్లాడడం తప్పా అని ఆమె అడిగారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు. 

మంత్రి నిరంజన్ రెడ్డి తనను మరదలు అంటూ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయమా అని ఆమె అడిగారు. ఈ వ్యాఖ్యలను చూసీ చూడనట్టుగా ఉంటూ తాను నోరు మూసుకొని ఉండాలా అని షర్మిల ప్రశ్నించారు. మరొకరైతే ఈ మాటలు అన్న మంత్రిపై తీవ్రంగా స్పందించేవారని  షర్మిల అభిప్రాయపడ్డారు. తనకు ఆత్మగౌరవం ఉండదా అని ఆమె ప్రశ్నించారు. తాను ప్రజల మధ్య ఉండాలనుకొంటున్నట్టుగా చెప్పారు. తన పాదయాత్రను నిలిపివేస్తే మరో రూపంలో ప్రజల వద్దకు వెళ్తానని షర్మిల చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios