వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైఎస్ షర్మిల.. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ షర్మిల ధర్నాకు దిగారు. భారతదేశం ఎన్నో పెద్ద స్కామ్‌లు జరిగాయని వైఎస్ షర్మిల అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కామ్ అని.. దానిని వెలుగులోకి తీసుకురావడానికే తాను ఈరోజు ఇక్కడకు వచ్చానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కుంభకోణం ఎంత పెద్దదో పార్లమెంటుకు తెలిపేందుకు తాను ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అయతే వైఎస్ షర్మిల జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌కు పాదయాత్రగా బయలుదేరుతుండగా.. కొద్ది దూరం ముందుకు కదలగానే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం షర్మిలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
అయితే షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో.. జంతర్ మంతర్ వద్ద ఆమెతో పాటు నిరసనకు దిగిన వైస్సార్‌టీపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
