తెలంగాణ ఎన్నికల్లో ఏపి సీఎం చంద్రబాబు అక్రమాలకు తెరలేపారని వైఎస్సార్ సిపి ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నుండి రేవంత్ కాంగ్రెస్ లో చేరడం కూడా చంద్రబాబు నాయుడి ప్లానేనని పేర్కొన్నారు. ఆ ప్లాన్ ప్రకారమే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారీగా ధనప్రవాహం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఒక్క తెలంగాణ ఎన్నికల కోసమే చంద్రబాబు రూ.1200 కోట్లు ఫండింగ్ చేసినట్లు తెలిపారు. కేవలం తెలంగాణలోనే కాకుండా మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు భారీగా డబ్బులు పంపిణీ చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమవద్ద ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు.

ఇక ఏపి ఎన్నికల ఖర్చు కోసం చంద్రబాబు దాదాపు రూ.15వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. యరపతినేని సుబ్బారావు, శ్రీనివాస రావు, గోపి ల ద్వారా డబ్బు బయటికి వెళుతున్నట్లు ఆరోపించారు. ఇవి ఆదారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలు కావని...ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం  తమ వద్ద ఉందని విజయసాయి రెడ్డి వెల్లడించారు. త్వరలో వాటిని బయటపెట్టి చంద్రబాబు గుట్టు రట్టు చేస్తామని హెచ్చరించారు.