ట్విస్ట్ : కీ రోల్ అతనిదే, సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. తెలంగాణ హైకోర్టులో వివేకా భార్య ఇంప్లీడ్ పిటిషన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో వివేకా సతీమణి సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు.

ys vivekananda reddy wife Sowbhagya filed implied petition in telangana high court

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో వివేకా సతీమణి సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేశారు. 2019, మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్యకు గురయ్యారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. పులివెందుల పీఎస్‌లో కేసు నమోదు చేశారని..దీనిని సీబీఐకి బదిలీ చేయాలని తాము హైకోర్టులో పిటిషన్ వేసినట్లు సౌభాగ్యమ్మ తెలిపారు. 2020 మార్చి 11న కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించిందని ఆమె వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి నేర అభియోగ పత్రాలు దాఖలు చేసిందని.. సీబీఐ అధికారులు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారని వివేకా భార్య పేర్కొన్నారు. 

అందులో ఏ2గా సునీల్ యాదవ్ వున్నారని.. సునీల్ యాదవ్ సహ నిందితులు దర్యాప్తు, విచారణను ప్రభావితం చేశారని ఆమె పిటిషన్‌లో ప్రస్తావించారు. కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారని సౌభాగ్యమ్మ వెల్లడించారు . 2022 నవంబర్ 29న విచారణను నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పు వచ్చిందన్నారు. సీబీఐ కోర్ట్ గత నెల విచారణకు స్వీకరించిందని.. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశాడని.. బెయిల్ ఇవ్వొద్దని ఇంప్లీడ్ పిటిషన్ వేసే హక్కు బాధితులకు వుంటుందని సౌభాగ్యమ్మ వెల్లడించారు. వైఎస్ వివేకా హత్య తర్వాత నిందితుల వల్ల.. తాను , తన కుమార్తె ఎంతో మానసిక క్షోభ అనుభవించామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్

ఇదిలావుండగా.. వివేకానందరెడ్డి  హత్య కేసు నిందితుడు  సునీల్ యాదవ్  దాఖలు  చేసిన  బెయిల్ పిటిషన్ పై  విచారణను  ఈ నెల  27వ తేదీకి  వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. 2019 మార్చి  19వ తేదీన  పులివెందులలోని తన నివాసంలో  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసు  సీబీఐ చేతికి వెళ్లగా.. విచారణ దశలోనే  కొందరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో  ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా  మరో రాష్ట్రంలో  విచారణ చేయాలని  వైఎస్ వివేకానందరెడ్డి  కూతురు వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం  తెలంగాణకు బదిలీ చేసింది. 

ఈ కేసులో  ఇప్పటికే  ఐదుగురిని  సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. వారిలో  సునీల్ యాదవ్  ఒకరు. మరోవైపు.. ఈ కేసులో  అరెస్టైన దస్తగిరి  సీబీఐకి అఫ్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని  సీబీఐ అధికారులు గతంలోనే  జమ్మలమడుగు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో  దస్తగిరి , ఎర్ర గంగిరెడ్డిలు బెయిల్ పై  బయట ఉన్నారు. అయితే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో  సీబీఐ పిటిషన్ దాఖలు  చేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios