రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ అభిమానులతో మాకున్న అనుబంధం చెరిగిపోనిదన్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ. ఖమ్మంలో జరుగుతున్న వైఎస్ షర్మిల బహిరంగ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

వైఎస్ఆర్‌ని నాయకుడిగా నిలబెట్టిన మీకు తమ కుటుంబం రుణపడి వుంటుందని ఆమె అన్నారు. 18 ఏళ్ల కిందట వైఎస్ఆర్ చేవేళ్ల నుంచి ప్రజాప్రస్థానం ప్రారంభించారని... వైఎస్ బాటలోనే ఖమ్మం నుంచి షర్మిల మీతో కలిసి నడిచేందుకు వచ్చిందని విజయమ్మ అన్నారు.

వైఎస్ఆర్ లేరన్న వార్తతో అనేక మంది గుండెలు ఆగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ మనిషిని మనిషిగానే ప్రేమించారని.. కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూశారని విజయమ్మ గుర్తుచేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్ఆర్ సంక్షేమ ఫలాలు అందించారని.. కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం ప్రారంభించారని ఆమె కొనియాడారు. వైఎస్ఆర్ పాలన ఒక స్వర్ణ యుగమని.. కరెంట్ బిల్లు అయినా, ఆర్టీసీ ఛార్జీలైనా ఏవీ పెంచలేదని విజయమ్మ గుర్తుచేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షల మంది ఆరోగ్యానికి మేలు చేశారని.. ఎయిర్‌పోర్ట్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే అయినా వైఎస్ఆర్ చలవేనని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలతో షర్మిల అనుబంధాన్ని దేవుడే రాసిపెట్టాడని.. వైఎస్సార్ తన బిడ్డలను విలువలతో పెంచారని చెప్పారు.

ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమని విజయమ్మ అన్నారు. 12 ఏళ్ల తర్వాత కూడా తమపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. షర్మిల ఒంట్లో దేనికైనా ఎదురీదే రక్తం వుందని.. రాజకీయంగా ఆమెకు ఇది తొలి అడుగని విజయమ్మ అన్నారు. తన బిడ్డను ఆ ప్రయత్నంలో ఆశీర్వదించాలని ఆమె కోరారు.