హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిళనే కాకుండా తల్లి వైఎస్ విజయమ్మ కూడా పోటీ చేసే అవకాశాలు లేవు. వైఎస్ జగన్ తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులంతా వచ్చే ఎన్నికల్లో పోటికి దూరంగానే ఉంటారని తెలుస్తోంది. 

కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండకూడదనే నియమం ప్రకారం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా జగన్ దూరం పెడుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైఎస్ జగన్ పులివెందుల నుంచి అసెంబ్లీకి, సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి కడప సీటు నుంచి లోకసభకు పోటీ చేస్తారని అంటున్నారు. 

విజయమ్మ గత ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి దాదాపుగా ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. షర్మిళ కూడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

విజయమ్మ గతంలో రెండు సార్లు పులివెందుల నుంచి శాసనసభకు గెలిచారు. వైఎస్ షర్మిళ లోకసభకు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ దాన్ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఆమెను స్టార్ కాంపైనర్ గా వాడుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. 

గత ఎన్నికల్లో షర్మిళ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు పాదయాత్రలు కూడా చేశారు. ఆమె ప్రచారం పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 

షర్మిళ పార్టీలో చురుగ్గా పాల్గొంటే అనవసరమైన తలనొప్పులు వస్తాయని భావిస్తున్నారని సమాచారం. ఆమె చురుగ్గా ఉంటే పార్టీలో రెండో అధికార కేంద్రం ఏర్పడుతుందనే భావనతోనే ఆమె దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఆమెను రాజ్యసభకు పంపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.