Asianet News TeluguAsianet News Telugu

YS Sharmila: "ప్రధాని మోడీని నిలదీసే దమ్ము దొర గారికి లేదు.." ప్రధాని పర్యటనపై షర్మిల వివాదాస్పద ట్వీట్

YS Sharmila: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ తెలంగాణ రాష్ట్రం  మోదీకి స్వాగతం పలుకుతోందని షాకింగ్ ట్వీట్ చేశారు.

ys sharmila tweet on prime minister narendra modi visit to hyderabad KRJ
Author
First Published Apr 8, 2023, 1:33 PM IST | Last Updated Apr 8, 2023, 1:33 PM IST

YS Sharmila: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్, బీజేపీల మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తయారయ్యాయి. నిత్యం ఇరుపార్టీల నేతలు విమర్శలు ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన నాటి నుంచి ఈ పార్టీల మధ్య రచ్చ మరింత ఎక్కువైంది. మరోవైపు పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో మరో సారి రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఈ తరుణంలో నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన సాగుతోంది. 

ఈ నేపథ్యంలో మోదీ టూర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. "ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోంది. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నాం." అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ఇలా రాశారు. "గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘కాళేశ్వరం KCRకు ATM’ అని BJP లీడర్లు బుకాయిస్తున్నారు. కానీ ఎంక్వైరీ చేయడం లేదు.YSRTP కాళేశ్వరం అవినీతిపై ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసింది. CAG,CBIకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలులేవు. మీ రాజకీయస్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం."  అని పేర్కొన్నారు. ఆ ట్వీట్ కు కొనసాగింపుగా.. "ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండని, నిలదీసే దమ్ము దొర గారికి లేదు. చేతకాని దద్దమ్మలా ఫామ్ హౌజ్ కే పరిమితమై..ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం KCR గారికి అలవాటుగా మారింది. దొర గారి రాజకీయాలు, మొండివైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది." అని  సీఎం కేసీఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. 

అంతకుముందు.. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. షర్మిల ట్విట్ చేస్తూ.. "ఆరోగ్య తెలంగాణ చేశామంటున్న దొరగారు కంటికి, పంటికి హస్తినకు ఎందుకు పోతున్నట్టు? ఆరోగ్య తెలంగాణ అంటే ఒక్కో బెడ్డు మీద ఇద్దరు,ముగ్గురిని పడేయడమా? లక్షమందికి ఒక డాక్టర్, 10వేల మందికి ఒక నర్సు ఉండటమా? కుని ఆపరేషన్లతో బాలింతలను పొట్టన పెట్టుకోవడమా? JHS, EHS స్కీములను పాతరేయడమా? అని నిలాదీశారు. అలాగే మరో ట్వీట్ లో .. "104 పథకాన్ని మూసేయడమా? పేదోడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి నిధులు ఎగ్గొట్టడమా? మీరు హామీ ఇచ్చిన.. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు. రాజధానిలో నలుదిక్కులా హెల్త్ హబ్బులు లేవు. ఉస్మానియా హెల్త్ టవర్ లేదు. ఎలుకలు కొరికి రోగులు చనిపోతున్నా పట్టింపులేదు. అని విమర్శలు గుప్పించారు. మరో ట్వీట్ లో.. "పరికరాలు, యంత్రాలు పనిచేయకపోయినా దిక్కూమొక్కూ లేదు. మారుమూల గ్రామాలకు అంబులెన్సులు లేవు. దవాఖాన్లలో సిబ్బంది లేరు. ఆసుపత్రి భవనాలు పాతబడి, పెచ్చులూడుతున్నా సోయి లేదు.ఆరోగ్య తెలంగాణ పేరుతో అనారోగ్య తెలంగాణగా మార్చారు.జబ్బు చేస్తే అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారు." అని మండిపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios