తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం, వడగళ్లతో జరిగిన పంట నష్టాన్ని వైఎస్సార్‌టీపీ వైఎస్ షర్మిల పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు ఎన్నడూ లేని విధంగా నష్టాలను మిగిల్చాయని షర్మిల అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం, వడగళ్లతో జరిగిన పంట నష్టాన్ని వైఎస్సార్‌టీపీ వైఎస్ షర్మిల పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు ఎన్నడూ లేని విధంగా నష్టాలను మిగిల్చాయని షర్మిల అన్నారు. ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రైతుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న సీఎం కేసీఆర్ ఎక్కడ అని ప్రశ్నించారు. అకాల వర్షంతో రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అన్నారు. ప్రభుత్వం లెక్కలు మార్చి చెబుతున్నా ఇప్పటికీ రైతులకు రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని మండిపడ్డారు. అక్కడక్కడా ఐకేపీ తెరుచుకున్న వడ్లు తడుస్తున్నా కొనుగోలు జరగటం లేదని విమర్శించారు. మిల్లర్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో ఐకేపీ సెంటర్లు తెరిచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. పంటనష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటలతో కూడిన ట్రక్కును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపనున్నట్టుగా వైఎస్ షర్మిల చెప్పారు. దెబ్బతిన్న పంటలతో నిండి ఉన్న ట్రక్కును షర్మిల మీడియాకు చూపించారు.
‘‘ఈ రోజు వైఎస్సార్ తెలంగాణ పార్టీ దెబ్బతిన్న పంటను కేసీఆర్‌కు పంపుతోంది. తద్వారా కనీసం ఎన్నికల సంవత్సరంలోనైనా కేసీఆర్ గాఢనిద్ర నుండి మేల్కొని రైతులకు తగిన పరిహారం అందజేయాలి. అకాల వర్షాల వల్ల దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కానీ ఒక్క అధికారి, ఎమ్మెల్యే కూడా రైతులను సందర్శించి నష్టాన్ని పరిశీలించలేదు. వారంతా రూ. 1,600 కోట్లతో కొత్తగా నిర్మించిన సచివాలయంలో ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. రైతులు అధిక వడ్డీకి అప్పులు చేసి పంటల కోసం తమ భార్యాభర్తల ఆభరణాలను అమ్ముకోవాల్సి రావడం బాధకరం. ఈ ట్రక్కు రైతుల కన్నీళ్లతో నిండి ఉంది’’ అని షర్మిల పేర్కొన్నారు.
గడిచిన తొమ్మిదేళ్లలో పంట నష్టం రూ. 14000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా.. ఈ ప్రభుత్వానికి పంటల బీమా అనే భావన లేదని షర్మిల మండపడ్డారు. ‘‘ఇదేనా భరోసా, ఇదేనా కిసాన్ సర్కార్? పంటల బీమా ఇవ్వని, ఇన్‌పుట్ సబ్సిడీలను పొడిగించని, రైతులను ఆదుకునే విషయంలో ప్రతి విషయంలోనూ విఫలమవుతున్న సర్కార్ ఇదేనా?’’ అంటూ కేసీఆర్ సర్కార్‌పై షర్మిల మండిపడ్డారు. ఇక, దెబ్బతిన్న పంటలతో కూడిన పంటను కేసీఆర్‌కు పంపేందుకు షర్మిల ప్రయత్నం చేయగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.
