తెలంగాణ గ‌వ‌ర్నర్‌ తమిళసైకు వైఎస్ ష‌ర్మిల బృందం లేఖ‌ రాసింది. క‌రోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేలా చూడాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షర్మిల అనుచరురాలు ఇందిరా శోభన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత పేదలకు లేదని, ఆరోగ్యశ్రీలో చేర్చితే పేద‌లకు ఉప‌యోగకరంగా ఉంటుందని ఆమె హితవు పలికారు. క‌రోనాతో చ‌నిపోతున్న జ‌ర్నలిస్ట్‌ల‌కు 50 ల‌క్షల బీమా ఇవ్వాలని ఇందిరా శోభన్‌ డిమాండ్ చేశారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ చేపట్టిన దీక్షను మంగళవారం నాడు పోలీసులు  భగ్నం చేశారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను  పోలీసులు  అరెస్ట్ చేశారు.

Also Read:ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేత... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీతక్క అరెస్ట్ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తులు, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.  ఎమ్మెల్యే సీతక్క ఆరోగ్యం క్షీణించడంతోనే  దీక్షను భగ్నం చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.

దీనిపై స్పందించిన షర్మిల... సీతక్క దీక్షకు సంఘీభావం తెలిపారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం ఆమె దీక్షను భగ్నం చేశారని షర్మిల ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేదని.. అయినప్పటికీ ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని షర్మిల ప్రశ్నించారు. ఇందుకు సీతక్కను అభినందించడమే కాకుండా, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఆమె ప్రకటించారు.