తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ విషయం ప్రకటించకపోయినా రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని అంటున్నారు. బ్రదర్ అనిల్ కార్యాలయంలో వైఎస్ షర్మిల సమావేశం ఈ రోజు పది గంటలకు ప్రారంభం కానుంది. తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను షర్మిల పూర్తి చేసుకున్నారు. 

ఈ సమావేశానికి ముందు ఆమె హైదరాబాదు శివారులోని ఓ హోటల్ లో సన్నిహితులతో సుదీర్ఘమైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ, వరంగల్ కు చెందిన ఓ కీలక నేతతో పాటు పలువురు ప్రముఖులతో షర్మిల చర్చలు జరిపారని అంుటన్నారు. పార్టీ ఏర్పాటుకు 9వ తేదీని ఆమె ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీని ప్రకటించిన తర్వాత ఆమె చేవెళ్ల నుంచి పాదయాత్ర చేస్తారని సమాచారం. చేవెళ్లతో వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో చేవెళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో వైఎస్ కు విశేషమైన ప్రజాదరణ లభించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 

చేవెళ్ల సెంటిమెంటు గురించి వైఎస్ పలుమార్లు ప్రస్తావించారు కూడా. దక్షిణ తెలంగాణకు తాగు, సాగు నీరు అందించడానికి చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టారు. 2008 నవంబర్ లో ఆయన చేవెళ్లలోనే దానికి శంకుస్థాపన చేశారు. 2009లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన చేవెళ్ల నుంచే ప్రారంభించారు. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 

అందుకే తండ్రి బాటలో షర్మిల నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల సెంటిమెంటు తనకు కూడా కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారని సమాచారం. ఏమైనా, షర్మిల పక్కా ప్రణాళికతోనే రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు చెబుతున్నారు.