Asianet News TeluguAsianet News Telugu

సజ్జల గారూ, ముందు మీ కథ మీరు చూసుకోండి.. ఎవరికైనా ఇదే సమాధానం: షర్మిల సంచలనం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మొదటగా సంబంధం లేదని సజ్జల చెప్పారని, ఇప్పుడు ఏం సంబంధం ఉందని తన గురించి మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు.

ys sharmila sensational comments on sajjala ramakrishna reddy ksm
Author
First Published Nov 6, 2023, 3:47 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. తాను తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మొదటగా సంబంధం లేదని సజ్జల చెప్పారని, ఇప్పుడు ఏం సంబంధం ఉందని తన గురించి మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తానైతే సంబంధం లేదని అనుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే.. సంబంధం మళ్లీ కలుపుకుంటున్నారా?.. ఏమానుకోవాలని ప్రశ్నించారు. 

‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ.. చీకటైతే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్పారు. మరి దానికి సజ్జల ఏం చెబుతారు.. ముందు మీ కథ మీరు చూసుకోండి సార్’’ అని వైఎస్ షర్మిల అన్నారు. ఈ సమయంలోనే సజ్జల మాట్లాడితే దాదాపుగా ఏపీ సీఎం జగన్ మాట్లాడినట్టే కదా అని మీడియా  ప్రతినిధులు అడగ్గా.. ఎవరికైనా ఇదే సమాధానమని షర్మిల సమాధానమిచ్చారు. 

తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని వైఎస్ షర్మిల చెప్పారు. తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది నిజమని..  ఆ పార్టీ కోసం ప్రచారం కూడా చేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం చేద్దామని అనుకున్నామని.. కొంత మంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీ విలీనం కాకుండా అడ్డుకున్నారని షర్మిల ఆరోపించారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై కేసు కొట్టేయాలని సుప్రీం కోర్టును కోరితే.. వాళ్లు దోషులేనని నిర్దారించి, కేసు కొనసాగించాలని కోర్టు చెప్పడం జరిగిందని అన్నారు. ఆయన దొంగ అని తాను చెప్పడం లేదని సుప్రీం కోర్టు చెప్పిందని అన్నారు. రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నారని.. రెటేంత రెడ్డి అంటూ ఆయనకు పేరు పెట్టిన వాళ్లు వేరే ఉన్నారని షర్మిల కామెంట్ చేశారు. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారని.. అయితే ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios