Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 28న వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం..

వైఎస్సార్ తెలంగాణ  పార్టీ అధ్యక్షురాలు పాదయాత్ర ఈ నెల 28న తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు వైఎస్ షర్మిల మంగళవారం వివరాలు వెల్లడించారు.

YS sharmila Says will resume padayatra from 28th january
Author
First Published Jan 24, 2023, 1:05 PM IST

వైఎస్సార్ తెలంగాణ  పార్టీ అధ్యక్షురాలు పాదయాత్ర ఈ నెల 28న తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు వైఎస్ షర్మిల మంగళవారం వివరాలు వెల్లడించారు. గతంలో ఎక్కడైతే పాదయాత్రకు బ్రేక్ పడిందో అక్కడి నుంచే యాత్ర మొదలుపెట్టనున్నట్టుగా చెప్పారు. తమకు ఒకరితో పొత్తు ఉందనో, ఒకరికి బీ టీమ్ అనడమో భావ్యం కాదని అన్నారు. అసలు బీజేపీకి, తమకు సిద్దాంతాలు వేరని చెప్పారు. బీజేపీ మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ సెక్యూలర్ పార్టీ అని చెప్పారు. తమకు బీజేపీతో ఎలా మ్యాచ్ అవుతుందని ప్రశ్నించారు. తమ పార్టీకి మతం లేదు, కులం లేదని అన్నారు. అందరూ తమవాళ్లేనని చెప్పారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి, బీజేపీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక, పాదయాత్రకు అనుమతి కోసం షర్మిల పార్టీ నేతలు వరంగల్ పోలీసులను ఆశ్రయించనున్నారు.

ఇక, గతేడాది నవంబర్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇక, తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీని స్థాపించిన సంగ తెలిసిందే. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి  ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,000 కిలోమీటర్లు నడవాలని యోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల ఇప్పటికే మూడు వేల కి.మీలకు పైగా పాదయాత్రను పూర్తిచేశారు. అయితే గతేడాది నవంబర్‌లో షర్మిల పాదయాత్రను పోలీసులు నర్సంపేటలో అడ్డుకున్నారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత ప్రగతి భవన్‌‌కు షర్మిల బయలుదేరడం, ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు తన పాదయాత్రకు సంబంధించి వైఎస్ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు షర్మిల పాదయాత్రకు అనుమతించింది. అయితే వరంగల్ పోలీసులు మాత్రం  షర్మిల పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. 

ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో.. పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడంపై స్పందించిన వైఎస్ షర్మిల.. ఆరోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు యాత్ర కొనసాగించలేకపోతున్నాని చెప్పారు. సంక్రాంతి  తర్వాత పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. హైకోర్టు తమ పాదయాత్రకు అనుమతించిందని.. ఇప్పటికైనా తన పాదయాత్రకు కేసీఆర్ అనుమతించాలని  షర్మిల డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios