కేసీఆర్‌కు షూ గిఫ్ట్.. నాతో పాదయాత్ర చేయండి.. అది నిజం కాకపోతే రాజీనామా చేయాలి: వైఎస్ షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తన వెంట నడవాలని సవాలు విసిరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తన వెంట నడవాలని సవాలు విసిరారు. కేసీఆర్‌కు షూ బాక్స్‌ను బహుమతిగా పంపనున్నట్టుగా తెలిపారు. ఈరోజు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్న సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ షూ బాక్స్‌ను గిఫ్ట్‌గా పంపనున్నట్టుగా చెబుతూ దానిని మీడియాకు చూపించారు. షూకు సంబంధించిన బిల్లు కూడా పంపుతున్నానని.. తన సైజు రాకపోతే రిప్లేస్ చేసుకోవచ్చని అన్నారు.
కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేశారని.. అయితే వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో నిరంకుశ, అసమర్థ పాలన సాగుతుందని మండిపడ్డారు. రైతులకు, యువతకు మహిళల సమస్యల పరిష్కారానికి, విద్యకు సంబంధించి.. ఇలా ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ వైఫల్యాలను, అవినీతిని బయటపెట్టేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తే తన పాదయాత్రపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారని షర్మిల ఆరోపించారు.
పాదయాత్రలో తనతో కలిసి నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నట్టుగా చెప్పారు. ‘‘ఇది బంగారు తెలంగాణ అని.. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని కేసీఆర్ చెప్పారు. ఆయన నాతో పాటు పాదయాత్రలో నడవనివ్వండి. ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు రాకుంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. ఒకవేళ అది నిజం కాకపోతే.. కేసీఆర్ రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం దళితుడిని సీఎం చేయాలి’’ అని షర్మిల సవాలు విసిరారు. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేశారని.. అయితే వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. గతంలోఆగిపోయిన చోటే తన పాదయాత్ర చివరి దశ తిరిగి ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు.
Also Read: వైఎస్సార్‌టీపీలో పొంగులేటి చేరికపై వైఎస్ షర్మిల కీలక కామెంట్స్.. ఏం చెప్పారంటే..
ఇక, వరంగల్ జిల్లా శంకరమ్మ తండాలో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు షర్మిల పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ రాత్రికి నెక్కొండలో ఆమె బస చేయనున్నారు.