జూలై 8న పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తామన్నారు వైఎస్ షర్మిల. మా పార్టీలో రేపటి కార్యకర్తలే రేపటి నాయకులని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడితే.. మీకు అండగా ఉంటానని, నా సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరమని షర్మిల కోరారు. ముస్లింకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు షర్మిల. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇచ్చారా అని నిలదీశారు.

దొర నందీ అంటే నంది .. దొర పంది అంటే పంది, దొర బాన్చన్ అని సాగిలపడినవాడికే ఈరోజు రాజకీయ భవిష్యత్ అన్నారు. తాను వెళ్లని సచివాలయాన్ని కేసీఆర్ కూలగొట్టించారని.. తెలంగాణను సాధించుకున్నా, ఆకాంక్షలు నెరవేరలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎన్నికలకు ముందు ఒకలా మాట్లాడతారని.. ఎన్నికలు అయిపోయాక ఇంకోలాగా మాట్లాడతారని ఆమె ఎద్దేవా చేశారు. హామీల గురించి కాంగ్రెస్ నిలదీయదని.. ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సప్లయ్ చేసే కంపెనీగా మారిందని షర్మిల ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అమ్ముడుపోయింది గనుక.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడదని మండిపడ్డారు. బీజేపీ మాట్లాడినా మతతత్త్వం గురించే మాట్లాడుతుందని షర్మిల పేర్కొన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డ్ అని హామీ ఇచ్చారని.. కానీ తాటాకు అడిగితే ఈతాకు ఇచ్చారంటూ బీజేపీపై షర్మిల సెటైర్లు వేశారు.

పసుపు బోర్డ్ అడిగితే స్పైస్ బోర్డ్ ఇచ్చి సరిపెట్టుకోమన్నారని.. తెలంగాణలో పాలకపక్షాన్ని ప్రశ్నించే గొంతు లేదని ఆమె అన్నారు. పైకి పోటీ నటిస్తున్నారని.. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.

అంతర్గతంగా అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలేనని.. పాలకపక్షాన్ని ప్రశ్నించే పార్టీ ఉండాలో వద్దా అన్న సంగతి జనం ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎవరు ఔనన్నా కాదన్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని.. ఇక్కడ గాలి పీల్చుకున్నానని, ఈ గడ్డ నీళ్లు తాగానని చెప్పారు.

ఈ గడ్డ మీదే పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని.. ఇక్కడే తన కొడుకుని కన్నానని షర్మిల చెప్పారు. ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం రుణం తీర్చుకోవడం తప్పా అని ఆమె ప్రశ్నించారు. బరాబర్.. తెలంగాణలో నిలబడతా.. ప్రజల కోసం కొట్లాడుతానని షర్మిల స్పష్టం చేశారు.

పదవులు వచ్చినా రాకపోయినా సంక్షేమం కోసం నిలబడతానని ఆమె వెల్లడించారు. నాకు అవకాశం ఇస్తారో లేదో ప్రజల ఇష్టమని.. అవకాశం వస్తే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతానని షర్మిల పేర్కొన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గురిపెట్టిన బాణాన్ని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారని షర్మిల ఆరోపించారు.