హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న షర్మిల తెలంగాణ రాజకీయాల్లో మహిళల పాత్ర గురించి మాట్లాడారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలంగాణ సమాజంలోనే కాదు రాజకీయాల్లోనూ మహిళలది కీలక పాత్ర అని షర్మిల అన్నారు. అలాగే ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువేనన్నారు. మహిళలు ఎవరీకి తక్కువకాదని... రాణి రుద్రమ లాంటి వీరవనిత చరిత్ర అందరికీ తెలుసన్నారు.  కానీ ప్రస్తుత రాజకీయాల్లో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత? అని షర్మిల ప్రశ్నించారు. 

అసమానతలను రూపుమాపడం కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో ఇంకా అసమానతలు ఉన్నాయని షర్మిల ఆరోపించారు. మహిళల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తన తండ్రి వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఎంతో మంది మహిళలకు మంత్రి పదవులు లభించాయని... కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత మహిళలకు కేబినెట్ లో చోటు దక్కిందని...అది కూడా ఇద్దరికే అవకాశం ఇచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో చట్టసభల్లో ప్రాతినిధ్యం నుండి ఉద్యోగం, ఉపాధి ఇలా ప్రతి విషయంలో అన్యాయం జరుగుతోందని అన్నారు. మహిళలు అన్నివిషయాల్లోనూ పురుషులతో సమానం అయినప్పుడు ఇలాంటి అసమానతలు ఎందుకో పాలకులే చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మహిళలకు అన్నింటా నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని... ఇందులో భాగంగానే మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని షర్మిల స్పష్టం చేశారు.