వివేకా హత్య కేసులో నిజానిజాలు త్వరగా తేల్చాలన్న షర్మిల.. ఆ ప్రశ్నకు మాత్రం ఉండకూడదు అని కామెంట్..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విచారణను త్వరగా పూర్తి చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఈ మేరకు రాజశేఖరరెడ్డి కుటుంబం సీబీఐకి ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విచారణను త్వరగా పూర్తి చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో చాలా గొప్ప నాయకుడని అన్నారు. ఎవరైనా సమస్యతో ఆయన దగ్గరకు వస్తే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపాలనే తపనపడేవారని చెప్పారు. ఆయనను దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి అలా తయారుచేసుకున్నారని అన్నారు. అంత మంచి నాయకుడిని అతి దారుణంగా హత్య చేసిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. ఈ ఘటన జరిగి కూడా సంవత్సరాలు గడిచిపోతుందని.. ఇలా కేసులు పరిష్కరించడానికి ఇంత సమయం పడుతుందంటే సీబీఐ మీద, దేశంలోని వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రతి కేసును కూడా దర్యాప్తు సంస్థలు వేగంగా పరిష్కరించాలని అవసరం ఉందని.. అప్పుడే వ్యవస్థల మీద ప్రజలకు భరోసా కలుగుతుందని అన్నారు.
ఇప్పటికైనా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజానిజాలు తేల్చాలని, దోషులను పట్టుకుని శిక్షించాలని కోరారు. ఈ మేరకు రాజశేఖరరెడ్డి కుటుంబం సీబీఐకి ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు. సీబీఐ వీలైనంత త్వరగా కేసును పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విచారణ ఒత్తిడి వెనక ఏపీ ప్రభుత్వం ఒత్తిడి లేదని అనుకుంటున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ఉండకూడదని వైఎస్ షర్మిల సమాధానమిచ్చారు.
ఇదిలా ఉంటే.. ప్రజాప్రస్థానంపై కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజాహితమే ధ్యేయంగా 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశామని షర్మిల తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేక పాదయాత్రపై కేసీఆర్ దాడి చేయించి, అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 28 నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఓటమి భయంతోనే ఖమ్మంలో కేసీఆర్ సభ పెట్టాడని అన్నారు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ చేసిందేంటని ప్రశ్నించారు. భద్రాచలానికి రూ. వంద కోట్లు అని రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. గోదావరికి కరకట్ట కట్టలేదని, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్‌ను, ఆయన పార్టీని ఖమ్మం జిల్లా ప్రజలు తరిమితరిమి కొడుతరని అన్నారు.