హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని లోటస్ పాండులో సోమవారం వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంతన ఉందో అందరికీ తెలుసునని ఆమె అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు అన్యాయం జరిగిందని ఆమె విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మహిళలకు విశేషమైన ప్రాధాన్యం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం రావడానికి ఐదేళ్లు పట్టిందని ఆమె అన్నారు. 

మహిళ హక్కుల సాధనకు తాను పోరాడుతానని చెప్పారు. చట్టసభల నుంచి ఉద్యోగాల వరకు మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని ఆమె అన్నారు. తెలంగాణ గడ్డ చైతన్యానికి అడ్డా అని, ఇక్కడి మహిళలకు ఎవరికీ తక్కువ కాదని ఆమె అన్నారు. రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని షర్మిల అన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంత అని ఆమె ప్రశ్నంచారు. 

అసమానతలు గెలిచి సాధించుకున్న రాష్ట్రంలో అసమానతలు ఉన్నాయని ఆమె అన్నారు. పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రంలో మహిళలు ఘోరంగా అన్యాయానికి గురయ్యారని ఆమె విమర్శించారు. 

మహిళల విషయంలో అధికార టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మహిళలు అన్నింటిలోనూ సమానమైనప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలో అసమానతలు ఎందుకో పాలకులు చెప్పాలని ఆమె అన్నారు. 

నేటి నుంచి తాను తలపెట్టే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని, చెల్లెగా, అక్కగా తాను మాట ఇస్తున్నానని ఆమె చెప్పారు.