పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తారని వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు ఆమె అనుచరుడు కొండా రాఘవరెడ్డి. ముందు పార్టీ నిర్మాణం మీదనే తమ దృష్టి వుందని.. ఏప్రిల్‌లో జరగనున్న ఖమ్మం సభకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మం లో నిర్వహించే సభకోసమే కో-ఆర్డినేటర్‌ను నియమించామని.. పార్టీ పేరు ప్రకటించకుండానే ఎన్నికలలో పోటీపై ఆలోచన ఎందుకుంటుందని రాఘవరెడ్డి ప్రశ్నించారు. 

కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించినట్లుగా బుధవారం వార్తలు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగే అని ఆమె అన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

Also Read:పాలేరు నుండి పోటీ చేస్తా: తేల్చేసిన వైఎస్ షర్మిల

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు బుధవారం నాడు లోటస్ పాండ్ లో షర్మిలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల సన్నాహలు చేసుకొంటున్నారు.

ఏప్రిల్ 9న కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మంలో సభ ఏర్పాటుకు సంబంధించి షర్మిల మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ నిర్వహణకు కూడా ఇప్పటికే అనుమతి తీసుకొన్నారు.