హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసం వద్ద ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసం వద్ద ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. షర్మిలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ పరిణమాలపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నెట్టుకుంటూ ముందకు కదిలారు. దీంతో పోలీసులకు, షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులను దాటుకుని వాహనంలో బయటకు వచ్చిన షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. 

ఈ క్రమంలోనే షర్మిల పోలీసులను తోసివేశారు. దీంతో పలువురు మహిళా పోలీసులు షర్మిలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె రోడ్డుపై బైఠాయించారు. తనకు సమాధానం చెప్పేవరకు తాను అక్కడి నుంచి కదలనని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎష్ షర్మిల అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అన్నారు. తనను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. తనను ఆపడానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. వ్యక్తిగత పనులకు కూడా తనను బయటకు వెళ్లనీయడం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వీడియో

రోడ్డు మీదక నడుచుకుంటూ వచ్చిన షర్మిలను ఇద్దరు మహిళా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే షర్మిల మాత్రం ముందుకే సాగారు. ఈ క్రమంలోనే ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.