నిరుద్యోగులకు మరోసారి అండగా నిలిచే ప్రయత్నం చేశారు వైఎస్ షర్మిల. శ్రీకాంత్ అనే నిరుద్యోగి నోటిఫికేషన్లు రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ట్విటర్ వేదికగా స్పందించారు.

‘‘నిరుద్యోగులు అధైర్యపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నిరుద్యోగ యువతను.. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం’’ అని షర్మిల ట్వీట్ చేశారు.

Also Read:వైఎస్ షర్మిలకు కేసిఆర్ ప్రభుత్వం షాక్: భద్రత ఉపసంహరణ?

కాగా.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని.. ఇక వచ్చే అవకాశం కూడా లేదని భావించిన వరంగల్‌కు చెందిన ఒక నిరుద్యోగి ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలో పాక శ్రీకాంత్ (25) అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా వున్న పోస్ట్‌లకు నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ఉద్దేశంతో వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇచ్చిన ఒక రోజు గడువు ముగిసినప్పటికీ.. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఆమె మిగిలిన రెండు రోజుల దీక్ష చేశారు.