కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై చర్చలు తుది దశకు వచ్చాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై చర్చలు తుది దశకు వచ్చాయని అన్నారు. నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి సందర్భంగా ఆయన కూతురు వైఎస్ షర్మిల ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆమె జరిపిన చర్చలపై స్పందించారు.
కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. తాను కార్యకర్తలను నిలబెడతానని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై వారికి గౌరవం ఉందని నిర్దారించుకున్న తర్వాతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చలకు వెళ్లినట్టుగా తెలిపారు. సోనియాతో జరిపిన చర్చలను తాను ఇప్పుడే బయటపెట్టడం సరికాదనిఅన్నారు. అయితే కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
వైఎస్సార్‌పై అపారమైన గౌరవం ఉందని సోనియా, రాహుల్ తనతో చెప్పారని షర్మిల అన్నారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడా సీబీఐ చార్జిషీట్ లో అబ్ స్కాండర్‌గా ఆయన పేరును చేర్చారని... ఆ బాధ ఎలా ఉంటుంతో తెలుసని వారు తనతో అన్నారని చెప్పారు. వైఎస్సార్ లేని లోటు తెలుస్తోందని కూడా వారు అన్నారని తెలిపారు.
తెలంగాణలో తాను 3,800 కి.మీ పాదయాత్ర చేశానని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ పాలన పోతేనే తెలంగాణకు మంచి జరుగుతోందని అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలన్నారు. తనతో నడిచిన వారిని తనతో పాటు నిలబెడుతానని షర్మిల పేర్కొన్నారు.
