తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలు అన్నీ కలిసి రావాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మి ల ఈరోజు సీపీఎం కార్యాలయానికి వెళ్లారు. 

తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలు అన్నీ కలిసి రావాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు పార్టీల నేతలను కలుస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంను కలిసిన షర్మిల.. నిరుద్యోగుల పక్షాన ఏర్పాటు చేసిన T - SAVE ఫోరంలో భాగమై, నాయకత్వం వహించాలని కోరారు. ఆ తర్వాత షర్మిల సీపీఎం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి కలిసి రావాలని కోరారు. 

అయితే అనంతరం వైఎస్ షర్మిల, తమ్మినేని వీరభద్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ క్రమంలో సీపీఎంపై షర్మిల విమర్శలు చేయడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అయితే షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని వీరభద్రం ఆమె మర్యాద నిలుపుకోలేదని చెప్పుకొచ్చారు. తొలుత షర్మిల మాట్లాడుతూ.. ‘‘బీజేపీతో వారికి ఉన్న అభిప్రాయాలు గురించి చెప్పారు. మేము రాకముందు అన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారు చేసిన పోరాటానికి మేము మద్దతు ఇవ్వలేదని అన్నారని వినిపించింది. అందరి సమక్షంలో అడుగుతున్నా.. అన్న ఏ ఒక్క పోరాటానికి మమ్మల్ని రమ్మని అడిగారా?. కలిసి పోరాటం చేద్దామని ఎప్పుడైనా ఫోన్ అయినా చేశారా?.

మీరు ఫోన్ కూడా చేయలేదు కానీ.. నేను ఈరోజు మీ పార్టీ ఆఫీసుకు వచ్చాను. అందరి ముందు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను బీజేపీకి బీ టీమ్ అన్నట్టుగా.. నేను నాటకాలు ఆడుతున్నానని మీరు మాట్లాడటం జరిగింది. మేము నాటకాలు ఆడలేదు. మునుగోడు ఎన్నికల్లో కూడా కేసీఆర్‌కు కమ్యూనిస్టులు బీ టీమ్‌గా పనిచేశారు. వైఎస్సార్‌‌టీపీ ఇప్పటివరకు ఏ పార్టీకి బీ టీమ్‌గా పనిచేయలేదు. బీజేపీ పట్ల మా వైఖరి స్పష్టంగా ఉంది. బీజేపీని నిలదీసింది ఏకైక పార్టీ వైఎస్సార్‌టీపీ. రాజకీయాల పక్కపెట్టి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి’’ అని పేర్కొన్నారు. 

అయితే షర్మిల వ్యాఖ్యలపై తమ్మినేని వీరభద్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. షర్మిల మాట్లాడిన తర్వాత తమ్మినేని మాట్లాడుతూ.. ‘‘మీ ఆఫీసుకు వస్తాం. మీతో మాట్లాడతామని చెబితే ఆహ్వానించాం. అయితే సోదరి ఆ మర్యాద నిలుపుకోవడం లేదు. ప్రతి పార్టీకి రాజకీయ వైఖరి ఉంటుంది. ఆమె రాజకీయ వైఖరి ఆమెకు ఉంటుంది. మా రాజకీయ వైఖరి మాకు ఉంటుంది. మునుగోడు ఎన్నికల్లో మేం చేసిన పని చాటుగా చేయలేదు. బహిరంగానే చేశాం.. మా స్టాండ్ ఏమిటో చెప్పాం. పైకో మాట.. చాటుకో మాట చెప్పే పార్టీ సీపీఎం కాదు. సీపీఎం జాతీయ పార్టీ.. వారికి బీ టీమ్.. వీరికి బీ టీమ్ అని విమర్శించే సాహసం మా ఆఫీసుకు వచ్చి చేయడం మంచిది కాదు. మా ఆఫీసులో ఉండగానే ఆమె మాట్లాడినట్టుగా నేను నిందిస్తూ మాట్లాడలేను. నాకు మర్యాద, విజ్ఞత ఉంది’’ అని పేర్కొన్నారు. 

అయితే ప్రస్తుతం వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీపీఎం కార్యాలయానికి వెళ్లడం కాకుండా.. ఆ పార్టీ నేతలపై షర్మిల ఈ విధంగా మాట్లాడటం ఏమిటనే? చర్చ కూడా సాగుతుంది.