వైఎస్ షర్మిల రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో వైఎస్ షర్మిల చేసిన నిరాహారదీక్ష ముగిసింది.

అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమె దీక్షను భగ్నం చేశారు. ఇందిరా పార్కు వద్ద దీక్ష భగ్నం చేసిన అనంతరం అక్కడనుంచి లోటస్‌పాండ్‌కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించారు.

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్టు చేశారు. అక్కడి నుంచి షర్మిలను పోలీసు వాహనంలోనే లోటస్‌పాండ్‌కు తరలించారు. తన నివాసం ముందు ఏర్పాటు చేసిన వేదికపై షర్మిల బైఠాయించారు. అంతకుముందు ఉదయం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు.

Also Read:ఇందిరాపార్క్‌లో ఒకరోజు గడువు పూర్తి: కాలినడకన లోటస్‌పాండ్‌కి షర్మిల.. నివాసంలోనే దీక్ష..?

ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని షర్మిల ధ్వజమెత్తారు.

ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తానని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.