హైదరాబాద్:  తెలంగాణలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా, పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. శనివారం హైదరాబాదు, రంగా రెడ్డి జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయులతో ఆమె సమావేశమయ్యారు. తన ప్రసంగాన్ని ఆమె జై తెలంగాణ నినాదంతో ప్రారంభించారు. తనవి ఆంధ్ర మూలాలు అనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ నినాదంతో ఆమె ప్రసంగాన్ని ప్రారంభించినట్లు అర్థమవుతోంది. 

సమావేశంలో పాల్గొన్నవారికి ఆమె 11 ప్రశ్నలతో ఓ ఫీడ్ బ్యాక్ ఫామ్ అందించారు. ఆ ఫామ్ పార్టీ ఏర్పాటుపై అభిప్రాయాలను కూడగట్టడానికి పనికి వస్తుందని ఆమె భావిస్తున్నారు. టీఆర్ఎస్ తాను ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసిందా అనేది ఫామ్ లో ఉన్న ప్రధానమైన ప్రశ్న. తెలంగాణలో సమస్యలపై మాట్లాడుదామని ఆమె చెప్పారు. 

తాను పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్న విషయంపై సామాన్య ప్రజల అభిప్రాయం ఎలా ఉందని ఫీడ్ బ్యాక్ ఫామ్ లో ఉన్న మరో ప్రశ్న. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి, అలాగే బిజెపిని ఎదుర్కోవడానికి మీరిచ్చే సలహాలు ఏమిటని ఆమె అడిగారు. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ప్రభుత్వంపై పోరాటానికి చేపట్టాల్సిన సమస్యలేమిటనే ప్రశ్నలు కూడా అందులో ఉన్నాయి. 

క్యాడర్ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలేమిటని ఆమె అడిగారు. అలాగే, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమిటి, వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణలో తేవాలంటే ఏం చేయాలని ఆమె అడిగారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందా అని ఆమె అడిగారు.