హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సభలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాజీవ్ రైతు రణభేరి సభ జరిగింది. ఈ సభకు అనూహ్యమైన వ్యక్తి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

రంగారెడ్డి జిల్లా రావిరాలలో జరిగిన రేవంత్ రెడ్డి రైతు రణభేరీ సభలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు ప్రత్యక్షమయ్యాడు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతను ముఖ్యమైన వ్యక్తిగా చెలామణి అయిన విషయం తెలిసిందే. 

సూరీడు రేవంత్ రెడ్డి సభా వేదికపై కనిపించడమే కాకుండా ఆయనతో కలిసి ఫొటో కూడా దిగాడు. సూరీడు అలా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటి నుంచి సూరీడు మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 

రేవంత్ రెడ్డి సభకు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కొండా సురేఖ, సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, మల్ రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, విజయ రమణారావు, ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.