ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తనకు సరైన ఉద్యోగం లేని కారణం చూపి.. ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో.. ఎలాగైనా ప్రేయసిని దక్కించుకునేందుకు పోలీసు అవతారం ఎత్తాడు. తనకు పోలీసు ఉద్యోగం వచ్చిందని అందరినీ నమ్మించాడు.

నకిలీ పోలీసు డ్రస్సు, ఐడీకార్డు, నేమ్ ప్లేట్ అన్ని క్రియేట్ చేసి ఫోటోలు దిగి అందరకీ షేర్ చేశాడు. తన ప్రియురాలికి, ఆమె తల్లిదండ్రులకు, చివరకు కన్న తల్లిదండ్రులను కూడా నమ్మించాడు.చివరకు కథ అడ్డం తిరగడంతో.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన మారేడుపల్లిలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎం.వి.రవిచంద్ర (29) మూడు సంవత్సరాలుగా వెస్ట్‌ మారేడుపల్లిలోని సామ్రాట్‌కాలనీ రేఖా రెసిడెన్సీలో  నివాసముంటున్నాడు. స్థానికంగా కాలనీవాసులకు, ఇంటి పరిసర ప్రాంతాల వారికి తాను ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నానని నమ్మబలికాడు.

2012లో రిక్రూట్‌మెంట్‌ బ్యాచ్‌కు చెందిన వాడినని పలువురికి చెప్పుకున్నాడు. పోలీసు యూనిఫాంతో పాటు ఐడీ కార్డు, నేమ్‌ ప్లేటులతో ఏసీపీగా చలామణి అవుతున్నాడు. అయితే..అతని తీరు అనుమానస్పదంగా ఉండటంతో... స్థానికుల్లో  ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అంతే.. పోలీసులు వచ్చి విచారించగా.. అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో.. పోలీసులు ప్రస్తుతం రవీంద్రను అరెస్టు చేసి విచారిస్తున్నారు.