కళ్లద్దాలు ఇప్పియ్యలేదని ఓ యువకుడు ఉరేసుకుని చనిపోయిన ఘటన మెదక్ జిల్లా, నర్సాపూర్  మండలం అహ్మద్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్ నగర్ కు చెందిన తలారి వెంకటేష్, మంగమ్మలకు రమేష్, దుర్గేష్ అని ఇద్దరు కొడుకులు.

దుర్గేష్ ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. మేస్త్రీ పని చేస్తున్నాడు. రోజూ అహ్మద్ నగర్ నుండి నర్సాపూర్ కు బండి మీద వచ్చి పని చేసి వెడుతుంటాడు. ఈ క్రమంలో తనకు కళ్లద్దాలు కావాలని రెండు రోజుల క్రితం రాత్రి వేళ తండ్రిని అడిగాడు.

సైట్ లేదు కదా కళ్లద్దాలు ఇప్పుడెందుకు అని తండ్రి తర్వాత చూద్దాంలే అన్నాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. దుర్గేష్ విసురుగా ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో రమేష్, తండ్రి కలిసి అన్ని చోట్లా వెతికారు. గురువారం మద్యాహ్నం మూడు గంటల టైంలో సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్న దుర్గేష్ కనిపించాడు. 

తమ్ముడ్ని అలా చూసిన రమేష్ తట్టుకోలేకపోయాడు. వెంటనే తండ్రికి, పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.