భార్యకి రెండో పెళ్లి చేస్తున్నారంటూ.. ఓ యువకుడు ఆందోళన చేపట్టాడు. పీటల మీద జరగుతున్న పెళ్లిని కూడా ఆపేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. తన భార్యను ఎత్తుకెళ్లి  వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారంటూ.. పెళ్లి ఆపిన ఆ యువకుడిపై యువతి తరపు బంధువులు దాడికి దిగారు. 

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌కు చెందిన సంజీవ్‌ అనే యువకుడు ఓ ఎస్‌ఐ కూతుర్ని ప్రేమించాడు. వీరిద్దరూ గత ఏడాది ఆర్య సమాజంలో పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు.

దీంతో ఆ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన కోర్టు సంజీవ్‌ భార్యను వెతికి పెట్టాలని పోలీసులను ఆదేశించింది. 

భార్యకు రెండో పెళ్లి చేస్తున్నారని తెలిసిన సంజీవ్‌.. పోలీసులతో కలిసి పెళ్లి మండపానికి వెళ్లాడు. తన భార్యను ఎత్తుకు వచ్చి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ పీటల మీద పెళ్లి ఆపుచేశాడు. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు అతడిపై దాడి చేశారు. అనంతరం పెళ్లి కూతుర్ని అక్కడినుంచి మాయం చేశారు. దీంతో ఆ యువకుడు తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగాడు.