ప్రేమ వ్యవహారంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరకు ఒకరి హత్యకు దారితీసిన దారుణ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుుకుంది.
నిర్మల్: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఓ అమ్మాయితో ప్రేమ విషయంలో ఇద్దరు యువకుల మధ్య చిన్న గొడవ ప్రారంభమై... అదికాస్తా పెద్దదై చివరకు ఒకరి దారుణ హత్యకు దారితీసింది. ఈ దుర్ఘటన నిర్మల్ జిల్లా (nirmal district)లో చోటుచేసుకుంది.
వివరాలల్లోకి వెళితే... నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శి నగర్ లో ప్రసాద్ కు మరో యువకుడితో ప్రేమ వ్యవహారం విషయంలో గొడవ జరిగింది. మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని కలుసుకున్న ఇద్దరు యువకుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన యువకుడు ప్రసాద్ పై కత్తితో దాడి చేసాడు. విచక్షణారహితంగా కత్తితో ప్రసాద్ శరీరంలో ఎక్కడపడితే అక్కడ పొడవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ప్రసాద్ మృతిచెందాడని నిర్దారించుకున్న తర్వాత నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. అయితే స్థానికులు రక్తపుమడుగులో యువకుడి మృతదేహం పడివుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మృతుడు ప్రసాద్ లోకేశ్వరం మండలం గడ్‌చందాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రసాద్ ని హత్య చేసిన నిందితుడు పరారీలో వున్నాడని...అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త అతి కిరాతకంగా ఆమెను హతమార్చాడు. భార్యపై అనుమానం పెనుభూతంగా మారి రాక్షసుడిలా మారిన భర్త కట్టుకున్నదాన్ని కడతేర్చిన ఘటన కోదాడ మండలం గణపవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
కోదాల ఎస్సై సాయి ప్రశాంతి తెలిపిన వివరాల ప్రకారం... గణపవరం గ్రామానికి చెందిన కాటబోయిన కొండలు, అంజమ్మ భార్యాభర్తలు. వీరికి 18 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. కొంత కాలంగా భార్యాభర్తల మశ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. తన భార్య అంజమ్మ ఎవరితోనో అక్రమ సంబంధాన్ని పెట్టుకుందని అనుమానం పెంచుకున్న కొండలు తరచూ మద్యం తాగి వచ్చి, భార్యను కొడుతూ.. శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.
అయితే మంగళవారం ఉదయం పొలం వద్దకు పని ఉందని చెప్పి తీసుకెళ్లిన కొండలు పక్కనున్న పంట కాలువలో అంజమ్మను పడేసి గొంతును కాలితో తొక్కుతూ ఊపిరాడకుండా చేశాడు. దీంతో అంజమ్మ ప్రాణాలు విడిచింది. గమనించిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. నరసింహారావు, గ్రామీణ ఎస్సై సాయి ప్రశాంత్ ఘటనాస్థలిని పరిశీలించి, మృతదేహాన్ని కోదాడలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
