స్నేహితుల మధ్య ఏయ్, ఓయ్, ఒరేయ్ లాంటి పిలుపులు సహజం. అలా పిలుచుకోని స్నేహితులు ఎవరూ ఉండరు. అలాంటిది... స్నేహితుడి తనని ఒరేయ్ అని పిలిచాడనే కారణంతో అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మూసాపేట యాదవ బస్తీలోని తాడెల లక్ష్మి, ఆమె కుమారుడు సుధీర్(20) నివాసముంటున్నారు.  పెయింటింగ్ పనిచేసే సుధీర్ సోమవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తర్వాత రూ.50 తీసుకొని తన స్నేహితులు గురజాల కిరణ్, నవీన్, రాంబాబులతో కలిసి బయటకు వెళ్లాడు. ఖైత్లాపూర్ సమీపంలోని గ్రౌండ్ లో స్నేహితులతో కలిసి మద్యం తాగాడు.

ఆ తర్వాత వీరికి మరికొంత మంది స్నేహితులైన కిరణ్, సాబేర్, హర్షవర్ధన్‌లు కూడా వీరికి తోడయ్యారు. అంతా కలిసి మద్యం తాగారు అనంతరం కిరణ్, రాంబాబు, హర్షవర్ధన్‌లు ఇంటికి వెళ్లి పోయారు. అక్కడే ఉన్న కిరణ్, నవీన్, సాబేర్‌లు సుధీర్‌తో మాట్లాడుతున్నారు. మాటల మధ్యలో సుధీర్‌ అరటి పండ్ల విక్రయ వ్యాపారి సాబేర్‌ ని ఒరేయ్‌ అన్నాడు. 

Also Read హడలెత్తించిన పిచ్చికుక్క.. మూడు గంటల్లో 50మందిని కరిచి..

వెంటనే నన్ను ఓరేయ్ అంటావా అని గొడవ పడ్డాడు.  ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగటంతో సుధీర్‌ను  సాబేర్‌ పక్కకు తీసుకెళ్లి బీరు బాటిల్‌ పగులగొట్టి  గొంతులో పొడిచాడు.  దీంతో వెంటనే సుధీర్‌ కింద పడిపోవటంతో సాబేర్‌ అక్కడి నుంచి స్కూటీపై పారిపోయాడు. 

అక్కడే ఉన్న తోటి స్నేహితులు నవీన్, కిరణ్‌లు వెంటనే సుధీర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుధీర్‌ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.