హైదరాబాద్ నగరంలోని అమీర్ పేటలో మంగళవారం మధ్యాహ్నం ఓ పిచ్చికుక్క హడలెత్తించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను, పాదచారులపై దాడి చేసింది. కేవలం మూడు గంటల్లో 50మందికిపైగా పిచ్చి కుక్క దాడి చేయడం గమనార్హం.

Also Read హైదరాబాద్ లలిత జ్యువెలర్స్ లో చోరీ..

ఒక్క పిచ్చికుక్క ఇతర కుక్కలను కూడా కరిసింది. దీంతో ఆ కుక్కలు కూడా ప్రజలపై దాడి చేశాయి. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోమాజీగూడ సీఎం క్యాంపు కార్యాలయం ఎదురు వీధి, ధరంకరం రోడ్డు, శివబాగ్, సత్యం థియేటర్ పరిసర ప్రాంతాల్లో 50మందికిపైగా కుక్కకాట్లకు గురయ్యారు. ఆలస్యంగా రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ వెటర్నరీ సిబ్బంది ఆ పిచ్చి కుక్క కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఈ లోపు అక్కడి స్థానికులు కుక్కను కొట్టి చంపేశారు. ఈ కుక్క దాడిలో గాయపడిన బాధితులంతా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు వెళ్లారు. ఈ బాదితుల్లో బేగంపేటకు చెందిన ఓ డాక్టర్ కూడా ఉండటం గమనార్హం. అంతేకాకుండా అమీర్ పేటలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా గాయపడ్డారు. కాగా.. చిన్నారులను ఇంటికి తీసుకువెళ్లేందుకు వారి తల్లిదండ్రులు చేతిలో కర్రలు పట్టుకొని మరీ తీసుకొని వెళ్లడం గమనార్హం.